తోటల్లో మొక్కలకు పోషకాలన్నీ భూమి నుంచే అందుతాయి. కానీ, బాల్కనీల్లో పెంచుకునే మొక్కలకు కుండీల్లోని మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నగరవాసులు ఎక్కువగా కుండీల్లోనే మొక్కలు పెంచుకుంటారు. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వేసవిలో అవి ఎండిపోవద్దని ఉదయం – సాయంత్రం నీళ్లు పోస్తుంటారు. అయితే, ఇలా నీళ్లు పట్టడం వల్ల కుండీలో మట్టి సారం కోల్పోతుంది.
అందులోని పోషకాలు నీటిలో కరిగిపోయి.. డ్రైన్ నుంచి కిందికి వెళ్లిపోతాయి. దాంతో, మొక్కలకు సరైన పోషణ కరువై.. అవి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కుండీల్లోని మట్టికి కూడా సరైన సోషణ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం ఎర్రమట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్, నాచుతో తయారైన ‘నేచురల్ పాటింగ్ మిక్స్’తో కుండీలను నింపుకోవాలి. కనీసం ప్రతి రెండు వారాలకు ఒక్కసారైనా నీటిలో కరిగే ఎరువులు వేయాలి. కుండీలో మొక్కను బట్టి.. ఎరువులు అందించాలి. ఇలా చేయడం వల్ల కుండీల్లో మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. తద్వారా అవి ఆరోగ్యంగా పెరుగుతాయి.