హైదరాబాద్: ఆలుమగలన్న తర్వాత చాలామంది అన్యోన్యంగానే ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. కానీ కొంతమందిలో ఆ సఖ్యత లోపిస్తుంది. కొన్ని జంటల్లో ఎవరో ఒక్కరు మాత్రమే గొడవలకు కారణమైతే, మరికొన్ని జంటల్లో ఇద్దరూ ఇద్దరే ఉంటారు. ఇక అరుదుగా కొన్ని జంటల్లో మాత్రం గొడవలు ఉండవు. అలాగని ప్రేమలూ ఉండవు. ఇద్దరిలో ఒకరు జీవిత భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. భర్త లేదా భార్యను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతుంటారు.
కానీ, ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల బాధిత మహిళ లేదా పురుషుడు మానిసికంగా గాయపడుతారు. క్రమంగా కుంగుబాటుకు లోనవుతారు. కాబట్టి అలాంటివారిని ముందే గుర్తించి కంట్రోల్ చేసుకోవాలి. పెద్దవాళ్లకు చెప్పి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఖరి మార్చుకోకపోతే కలిసి బతుకడం కుదరదని హెచ్చరించాలి. దాంతో కలిసి బతుకాలనుకుంటే కచ్చితంగా దారికొస్తారు. లేదంటే విడాకులకు సిద్ధపడుతారు. అంతదాక వస్తే విడిపోవడమే ఉత్తమం. మరి నిర్లక్ష్యం చేసేవాళ్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందామా..?
నాకంటే మంచి వ్యక్తి నీకు దొరకకపోవు..
కొంతమంది ‘నన్ను చేసుకోవడంవల్లే నీ జీవితం హ్యాప్పీగా ఉంది’ అంటారు. ‘నేను చేసుకోకపోతే నీకు నాకంటే మంచి లైఫ్ పార్ట్నర్ దొరికకపోవు’ అని ఎగతాళి చేస్తుంటారు. కొందరు ‘నువ్వు ఇంత మంచి వ్యక్తివి అని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి మాటలు తరచూ అంటున్నట్లయితే వారిని సరిచేయాల్సిందే. అయితే, ప్రేమగా చూసుకునేవాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
బహిరంగ విమర్శలు..
జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేసే వ్యక్తులు వారిని బహిరంగంగానే విమర్శిస్తారు. పదిమందిలో కూడా మీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తారు. అందరి ముందు అవలీలగా దూషిస్తారు. చివరికి మీ రూపాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా వెక్కిరిస్తారు. మీ ఆశయాలను ఎగతాళి చేస్తారు. అంటే గతంలో ఏదైనా మీ ఆశయంగా మీ భాగస్వామికి చెప్పివుంటే నలుగురిలో ఆ విషయాన్ని ప్రస్తావించి హేళనగా మాట్లాడుతారు.
ఎదుటివాళ్లతో పోల్చడం..
కొందరు ప్రతిదానికీ బయటి వాళ్లతో పోలుస్తారు. మీకంటే ఎదురింటి వ్యక్తి ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నారని విమర్శిస్తారు. పక్కింటి వ్యక్తితో పోల్చితే మీ తెలివితేటలు ఎందుకూ పనికిరావంటారు. మీకంటే ఎదుటివాళ్లు అందంగా ఉన్నారని అవమానిస్తారు. పక్కింటి వాళ్ల వంట అమృతంలా ఉన్నదని, మీ వంట పెంటలా ఉన్నదని ఒళ్లుమండే వ్యాఖ్యలు చేస్తారు. మనల్ని మానసిక రోగులుగా మార్చే ఇలాంటి మాటలకు సాధ్యమైనంత త్వరగా అడ్డుకట్టపడేలా చేయాలి.