నడకను మించిన వ్యాయామం లేదన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం అరగంటసేపు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతోమంచిది. అయితే, మామూలు నడకతోపాటు మధ్యమధ్యలో ‘హీల్ వాక్’ చేస్తే.. మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. పాదాలు మొత్తంగా నేలకు తగలకుండా.. కేవలం మడమలపై నడవడమే హీల్ వాక్. ఇందులో భాగంగా.. రెండు చేతులూ నడుముపై పెట్టుకుని, శరీర బరువు మొత్తం మడమలపైనే ఉంచి నడక సాగించాలి. రోజూ కనీసం ఐదు నుంచి పది నిముషాలపాటు ఇలా నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. హీల్ వాక్‌తో మోకాళ్లు, మడమలు ఆరోగ్యంగా ఉంటాయి.
రెగ్యులర్‌గా చేస్తే.. పాదాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా.. మోకాళ్ల నొప్పులు, పాదాల్లో నీరు రావడం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎముకలు, కండరాలు పిక్కలు బలంగా మారతాయి. దాంతో, ఎంత దూరమైనా సులువుగా నడిచేస్తారు. ఈ రకమైన వాకింగ్‌తో శరీరంలోని క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతాయి.
కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి మంచి వ్యాయామం అవుతుంది. హీల్ వాక్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే.. గుండె కండరాలు బలపడతాయి. హార్ట్ అటాక్‌తోపాటు ఇతర హృదయ సంబంధ సమస్యలు దూరమవుతాయని, రక్తపోటు అదుపులోకి వస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.