ప్రస్తుతం మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ జీవనశైలి వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం ఆయుఃప్రమాణం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారితో పోల్చితే ఈ వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు తక్కువగా ఉంటుంది.
అయితే, వ్యాధులతో సంబంధం లేకుండా ఎవరైనా నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనిషి జీవిత కాలం పెరుగాలంటే ప్రతిరోజు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని సూచిస్తున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలు శారీరక శ్రమ చేయాల్సిందేనని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అధ్యయనాల ఫలితాల ఆధారంగా నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు.
10 వేల మందిపై అధ్యయనం..
టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా బ్యాడ్మింటన్ లాంటి క్రీడలపట్ల దృష్టిపెడితే శరీరాలకు మంచి వ్యాయామం అవుతుందని ఇటీవల జరిగిన రెండు వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. ఈ రెండు అధ్యయనాలు కూడా శారీరక శ్రమతోనే మనిషి జీవితకాలం పెరుగుతుందని స్పష్టంచేశాయి. దశాబ్దకాలంగా దాదాపు 10 వేల మంది స్త్రీలు, పురుషుల అభిప్రాయాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వచ్చిన ఫలితాల ఆధారంగా అధ్యయనకారులు నివేదిక రూపొందించారు.
శరీరాలకు కావాల్సినంత వ్యాయామం లేకపోవడంవల్ల గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలతో అకాల మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా అకాల మరణాలను 70 శాతం వరకు తగ్గించవచ్చని నూతన అధ్యయనాల్లో తేలింది. సాధారణ వ్యాయామంతోపాటు యోగాసనాలు వేసేవాళ్లు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఈ అధ్యయనాలు సూచించాయి. వ్యాయామాలవల్ల ఆయుర్దాయం పెరగడమేగాక వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.
శారీరక శ్రమే శ్రీరామరక్ష..
నిత్యం వ్యాయామాలు చేసేవాళ్లతో పోల్చితే అస్సలు వ్యాయామం చేయనివాళ్లు, అరుదుగా వ్యాయామం చేసేవాళ్లలో వ్యాధినిరోధక శక్తి తగ్గినట్లు పరిశోధనలు స్పష్టంచేశాయి. 2018లో అమెరికాలో ఓ అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనం ప్రకారం అమెరికన్లలో 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసువారి మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. వారిలో 10 శాతం మంది మరణాలకు చాలా తక్కువ సమయం వ్యాయామం చేయడమే కారణమని తేలింది. కాబట్టి నిత్యం వ్యాయామం చేయడం అన్నివిధాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..