పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, వడగాలులతో గుండె, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. అధిక వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తనను తాను నియంత్రించుకునే లక్షణం చెదిరిపోతుందని చెబుతున్నారు. వడదెబ్బతో రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా, ముఖ్యమైన అవయవాలకు తగినంతగా రక్తం సరఫరా కాదు. గుండెపై ఒత్తిడి పెరిగి.. గుండెదడ లాంటి సమస్యలూ వస్తాయి. కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణ తగ్గి.. గుండె కండరాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.
దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక వడగాలులతో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి.. శ్వాసకోస సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారిని మరింతగా ఇబ్బందిపెడతాయి. వీరిలో శ్వాస ఆడకపోవడం, గురక, దగ్గుకు కారణం అవుతుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే.. ఊపిరితిత్తుల వాపు, న్యుమోనియాకూ దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.