వివిధ పోషకాలతో నిండిన డ్రాగన్ ఫ్రూట్.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పాస్ఫరస్ లాంటి మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సితోపాటు బి1, బి2, బి3 కూడా అధికంగా లభిస్తాయి. అందుకే.. ఈ పండు తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా.. ఆడవాళ్లకు డ్రాగన్ ఫ్రూట్ అమృత ఫలమే అవుతుంది.
డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మహిళల్లో కనిపించే సాధారణ సమస్య.. ఐరన్‌లోపం. నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల.. ఈ సమస్య వేధిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్లో లభించే మరో అద్భుతమైన పోషకం.. ఫోలేట్. ఇది గర్భిణులకు ఎంతో అవసరం. గర్భస్థ శిశువులో మెదడు, వెన్నుపాము అభివృద్ధిలో ఫోలేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ సి అధికంగా లభించే డ్రాగన్ ఫ్రూట్.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా.. అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
ఇక ఆడవాళ్లను బోలు ఎముకల వ్యాధి కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ‘ఆస్టియో పోరోసిస్’ వచ్చే ప్రమాదం ఉంటుంది. మెగ్నీషియం, క్యాల్షియంతో నిండిన డ్రాగన్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే.. ఎముకలు బలంగా తయారవుతాయి. వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఆరోగ్యపరంగానే కాదు.. అందాన్ని కాపాడటంలోనూ డ్రాగన్ ఫ్రూట్ ముందుంటుంది. ఇందులో లభించే విటమిన్ సి.. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. ఇది చర్మం, జుట్టు, గోర్లు, ఎముకలతోపాటు కీళ్ల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది.