పిల్లల మనస్తత్వం, వ్యక్తిత్వంపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పుట్టినప్పటినుంచీ పిల్లలు వారి తల్లిదండ్రులతో గడిపే సమయం ఎక్కువ. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రవర్తన, అలవాట్లను పిల్లలు కూడా అలవర్చుకుంటారని తాజా అధ్యయనంలో తేలింది. వాటిలో మంచి, చెడు రెండు విధాలైన అలవాట్లు ఉంటాయంటున్నారు నిపుణులు.
పిల్లలు చిన్నతనంలో నేర్చుకునే అలవాట్లు వారి జీవితాంతం కొనసాగుతాయి. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా ఉండటం, ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం వంటివి చూస్తే వారికి అదే అలవాటుగా మారొచ్చు. ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచడం వల్ల పిల్లలకూ శుభ్రత అలవడుతుంది.
చాలామంది తల్లిదండ్రులు పిల్లల విజయాన్ని మార్కులతో లెక్కిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీనివల్ల వారిలో కోపం, నిరాశ పెరుగుతాయి. పిల్లల తెలివితేటలను మార్కులతో కొలవకుండా వారిని ఉత్తమ ఫలితాలు అందుకునేలా ప్రోత్సహించాలి.
పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం, ఒకరినొకరు కొట్టుకోవడం చేయకూడదు. అమ్మానాన్నలు కారాలూ, మిరియాలూ నూరుకోవడం చూసి పిల్లలూ అలాగే తయారవుతారు. తోటి పిల్లలతో తరచూ గొడవపడే అవకాశం ఉంటుంది. అసభ్య పదజాలం నేర్చుకునే ప్రమాదమూ ఉంది. అందువల్ల పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడకూడదు.