వెండి కంచం ఓ ముచ్చట. బంగారు పువ్వున్న వెండి కంచం అయితే మరింత సంబురం. అయినవాళ్లు ఇచ్చిపుచ్చుకునే బహుమతి ఇది. పెండ్లి వేళ అల్లుడికి స్థితిమంతుడైన మామగారు చదివించే కానుక. అయితే, రుచిగల పదార్థం విస్తట్లో తిన్నా.. మెరిసిపోయే వెండి కంచంలో తిన్నా జిహ్వకు ఒకటే! కానీ, మనసుంది చూశారూ..! ఏదో కోరుకుంటుంది. వెండి కంచం మాట వినగానే.. అందులో విందారగిస్తే భలేగా ఉంటుందని ఊహించేసుకుంటుంది. అయితే, తినాలనిపించడమే కానీ, తినలేమని దిగులుపడేవాళ్లకు గుజరాత్ హోటళ్లు రారమ్మని పిలుస్తున్నాయి. గుంతల వెండి కంచంలో ఇత్తడి గిన్నెలు పేర్చి, అందులో రకరకాల పదార్థాలు చేర్చి ఘనమైన ఆతిథ్యం ఇస్తున్నాయి.
వెండి కంచంలో విందుకు అంతగా ఎగబడటం ఏమిటి? దాని గురించి ఇంత ప్రస్తావన ఎందుకు? అన్న అనుమానం రావొచ్చు. ఇది సాదాసీదా సిల్వర్ ప్లేట్ కాదు. సంత్రాంపూర్ మహారాజు ముచ్చటపడి తయారు చేయించుకున్న వెండి కంచం. ఆయనగారు తిని ఎంగిలి చేసిన కంచంలో విందేంటని విస్తుపోకండి. ఆయన చేయించుకున్న నమూనాలో రూపొందించిన కంచాలన్నమాట ఇవి! గుంతల కంచం మనం చూసే ఉంటాం. సాధారణంగా అందరి ఇళ్లలో సాదాసీదా స్టీలు కంచాలే ఉంటాయి. ఒకటో రెండో గుంతల కంచాలు కూడా ఉంటాయి. అన్నిట్లో ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఐదారు గుంతల్లో అన్నేసి పాకాలు వేసి, మధ్యలో పొగలు కక్కే అన్నం వడ్డించి పెడితే.. రెండు ముద్దలు ఎక్కువ లాగించడం ఖాయం. సంత్రాంపూర్ వెండి కంచం కూడా అదే కోవకు చెందుతుంది. ఇంకా చెప్పాలంటే అంతకు పదింతలు గొప్పగా కనిపిస్తుంది.
హోటల్లో ఫుల్‌మీల్స్ ఆర్డర్ చేయగానే.. కంచం చుట్టూ గిన్నెల్లో రకరకాల పదార్థాలు ఇస్తారు కదా! సదరు ప్లేటు టేబుల్ మీదికి రాగానే… ఆ గిన్నెలన్నీ చకచకా తీసి చుట్టూ పెట్టుకోవడం రివాజు! సంత్రాంపూర్ వెండి కంచంలో ఈ పప్పులు ఉడకవు. ఇందులో చుట్టూ గుంతలు ఉంటాయి. వాటిలో ఇమిడిపోయే ఇత్తడి పాత్రలు (పులుసు గిన్నె పరిమాణంలో) ఉంటాయి. ఏ గిన్నె మరో గిన్నె ప్లేస్‌లో ఇమడదు. తీసింది వేసుకోవడం… మళ్లీ తీసిన గుంతలోనే పెట్టేయడం కంపల్సరీ! కింద పెడదామన్నా.. నిలవదు. ఈ కంచం పీఠంలా ఉంటుంది. దానికి నాలుగు వైపులా సుమారు నాలుగు అంగుళాల పాదాలు ఉంటాయి. వీటిని పులి పాదాల్లా, సింహాసనం కాళ్లలా రూపొందిస్తున్నారు. పళ్లెం నాలుగు అంగుళాల ఎత్తు ఉండటం వల్ల.. భుక్తాయాసంతో పొట్ట ఉబుకొచ్చినా.. ఎంచక్కా లాగించ వచ్చన్నమాట.
ఈ కంచంలో తినడం కోసమనే గుజరాత్ రెస్టారెంట్లో ‘సంత్రాంపూర్ థాలీ’కి డిమాండ్ పెరిగిందట. ముచ్చట గొలిపే ఈ కంచానికి మూల పురుషుడు సంత్రాంపూర్ మహారాజా జొరావర్ సింగ్. ఆయనగారి అంతఃపురం ఈ నగిషీల ప్లేట్‌కు పుట్టినిల్లు. రాజుగారు తలుచుకుంటే బంగారు కంచాలకూ కొదువ ఉండదు. కానీ, ఆయనకు వెండికంచం మీద మోజేంటి అనే కదా మీ సందేహం! దీని వెనుకా ఓ కథ ఉంది! ఒకరోజు జొరావర్ సింగ్ కంసాలిని కలిసి నాకు వెండి కంచం కావాలని కోరారట. ‘చిత్తం ప్రభూ! అదెంత పని!’ అన్నాడట కంసాలి. ‘సాదాసీదా కంచం కాదు నాకు కావాల్సింది. మన సంత్రాంపూర్ రాజ ప్రాసాదం ఝరోకాల (బాల్కనీల వంటి నిర్మాణాలు) ఆకృతిలో వీటిని తీర్చిదిద్దాల’ని కోరారట. ఆ మేరకు విచిత్రాకృతిలో ఈ కంచం రూపుదిద్దుకుంది. రాజుగారి విందులో ఈ కంచాల వైభవం చూసి ముచ్చటపడిన వాళ్లంతా ఇలాంటివి తయారు చేయించుకున్నారట.
ఈ కొత్తరకం కంచం ‘సంత్రాంపూర్ పళ్లెం’గా ప్రసిద్ధిగాంచింది. తరానికో ట్రెండ్ వస్తూ ఉంటే ఈ పాతకాలపు కంచాలన్నీ మూలనపడ్డాయి. మళ్లీ ఇన్నాళ్లకు తాజా డిజైనర్లకు ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ సూత్రం గుర్తొచ్చింది. సంత్రాంపూర్ కంచాలకు టైమొచ్చింది. ప్రఖ్యాత డిజైనర్లు, వెండి వస్తువుల తయారీదారులు రకరకాల రీతుల్లో, నగిషీలు చెక్కుతూ సంత్రాంపూర్ కంచాలను తయారు చేస్తున్నారు. వెండి, వెండిపూత పోసిన సంత్రాంపూర్ కంచాలు రూ.40 వేల నుంచి రూ.6 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ఇదే అదనుగా పేరున్న రెస్టారెంట్లు, టూరిస్ట్ హోటళ్లు ఈ కంచాలను కొని.. సంత్రాంపూర్ థాలీని ఆఫర్ చేస్తూ పర్యాటకులకు కొత్త అనుభూతులు పంచుతున్నాయి! బరోడా, అహ్మదాబాద్, సూరత్ నగరాల్లోని హోటళ్లలో ఇప్పుడు సంత్రాంపూర్ థాలీ హడావుడి హాట్ హాట్‌గా నడుస్తున్నది. ఇదండీ రాజుగారి వెండి కంచం కథ!