Flower Claw Clip | ముడిలో మల్లెలు ముడవడం, జడలో గులాబీలు తురమడం… అందానికి పందిరేసే సంగతులే అయినా, ఈ రోజుల్లో పువ్వులు అవుటాఫ్ ఫ్యాషన్ అలమరాలో చేరిపోయాయి. అలా అని ఇంతి మనసు పూబంతుల మీద నుంచి సాంతం దూరమైపోయిందనీ చెప్పలేము. ఆ అందాన్ని ఎలాగోలా తన అలంకారంలో అమరిస్తే బాగుంటుందనే ఆలోచన సాగుతూనే ఉంటుంది. అందుకే, ఇటు ఫ్యాషన్ మెరిసేలా, అటు విరుల సొగసు విరిసేలా ‘ఫ్లవర్ క్లా క్లిప్’లు మార్కెట్లోకి వస్తున్నాయి.
జుట్టు విరబోసుకోవడం ఇప్పుడు ప్యాషన్. కాలేజీకో, ఆఫీసుకో వెళ్లేప్పుడు మాత్రం గాలితో పాటు గోల చేసే జుట్టును గారాబంగా కట్టేయడానికి క్లా క్లిప్పులు లేదా క్లచ్‌లకు పనిచెబుతారు అమ్మాయిలు. దానిని దిగ్విజయంగా పూర్తి చేసి ఆడపిల్లల అభిమానాన్ని చూరగొన్నాయి కాబట్టే, వీటికి గర్ల్ సర్కిల్లో యమా క్రేజ్. మన్మథుడు సినిమాలో హీరోయిన్ క్లిప్పును తీసి ఫైలుకు పెట్టినట్టు, వీళ్లు కూడా వీలుని బట్టి వీటిని వాడేస్తుంటారు. అందుకే ఎన్నెన్నో వర్ణాలతో, ఇంకెన్నో అందాలతో ఇవి ముస్తాబయి వస్తున్నాయి. వీటికీ ఆడపిల్లలకూ ఉన్న అనుబంధాన్ని చూసి పువ్వుల సోకునూ రంగరించి ఆమెకు సింగారానికి సిద్ధం చేశారు డిజైనర్లు.
నచ్చిన పువ్వు…
ఒకరికి గులాబీ పువ్వు ఇష్టం. మరొకరికి మల్లెలంటే ప్రాణం. ఇంకొకరు చామంతుల అందాన్ని ఆరాధిస్తారు. తులిప్, బ్లూ బెల్స్లాంటి ప్రత్యేకమైన పువ్వులు నచ్చేవారు కొందరుంటారు. ఇలా ఎవరి అభిరుచిని బట్టి వారు ఎంచుకునేలా అచ్చం నిజమైన పువ్వులను తలలో పెట్టుకున్నట్టు కనిపించేలా… ఈ ఫ్లవర్ క్లా క్లిప్పులు రూపొందుతున్నాయి. రంగు రంగుల పూల అందాన్ని జడకు అద్దుతూనే ఫ్యాషన్ లుక్‌ని తీసుకురావడం వీటి ప్రత్యేకత.
ప్లాస్టిక్‌తో చేసిన వాటితోపాటు, మెటల్ మీద ఎనామిల్ రంగులు వచ్చి, రాళ్లు, పూసలు పొదిగినవి కూడా ఈ తరహాలో తయారు అవుతున్నాయి. విరబోసిన జుట్టులో చిన్నపాయ తీసి పెట్టుకునేందుకు, బన్, హాఫ్ బన్ మోడళ్లకూ, ట్రెండీ హెయిర్ ైస్టెల్స్కు ఇవి చక్కగా నప్పుతాయి. సౌకర్యం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా రోజువారీ వాడే వాటిలాగే వీటినీ పెట్టుకోవచ్చు. ఎంచక్కా పువ్వులు అలంకరించుకున్నట్టు అందంగానూ కనిపించొచ్చు. ప్రత్యేకంగా అలంకరించుకోకుండానే స్పెషల్‌గా కనిపించాలంటే పూల క్లిప్పులు మంచి ఎంపిక… ఏమంటారు?