హైదరాబాద్ : ఖాయిలా పడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిసిఐ సీఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని సిఎండి చెబ్తున్నారని, అది జరిగితే మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్లాంటు ప్రైవేటీకరణను (డిస్ ఇన్వెస్ట్ మెంటును) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పునురుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సిసిఐ కోరుతోందని, త్వరలోనే దీనిపైన తమ అభిప్రాయాలను అందచేస్తామని వెల్లడించారు. రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు నిర్వహణ అసాధ్యమేమీ కాదని శ్రీధర్ బాబు చెప్పారు.
సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టిజిఐఐజి ఎండీ శశాంక తాండూరు సిసిఐ ప్లాంట్ జిఎం శరద్ కుమార్, సిసిఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలు కూడా సమావేశానికి హాజరై తమ సూచనలను వెల్లడించారు.