KTR | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. రైతుల గోస తీర్చాలని 20 రోజుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెప్పారు. అందుకే 70 లక్షల రైతన్నల తరఫున ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎన్డీఏ, ఇండియా కూటముల ప్రతినిధులు అని కేటీఆర్ అన్నారు. వాళ్ళు వ్యక్తులుగా పోటీ చేయడం లేదని.. ఆయా కూటముల తరఫున పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రాష్ట్ర రైతులను వేధిస్తున్నాయని.. సతాయిస్తున్నాయని.. ప్రాణాలు తీస్తున్నాయని విమర్శించారు. యూరియా కొరతపై 20 రోజుల క్రితం మేము హెచ్చరించి అప్రమత్తం చేసినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదని తెలిపారు. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిర్ణయాన్ని 71 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున తీసుకున్నామని పేర్కొన్నారు. మేం ఎన్డీయే సబార్డినేట్ కాదు.. ఇండియా సబార్డినేట్ కాదు.. తెలంగాణ ప్రజల సబార్డినేట్ అని తెలిపారు. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను తెలియజేయడానికి దీన్ని వేదికగా వాడుకుంటూ.. రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో పాల్గొనవద్దని నిర్ణయించామని తెలిపారు. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం. లేదు కాబట్టే ఎన్నికల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.