అక్షయ తృతీయ, ధన త్రయోదశి… ఇలా బంగారం కొనుక్కోవడానికి ఏవో సాకులు. ఐస్‌క్రీం కొనిస్తానంటే అల్లరి చేయకుండా చెప్పింది చేస్తా అనే చిన్నపిల్లల్లా, ఎన్నిసార్లు అడిగీ అలిగీ స్వర్ణాభరణాలు కొనిచ్చుకుంటారో సుందరీమణులు. సందర్భం ఏదైనా సరే బంగారం సంగతి రాగానే మనసు ఠక్కున ఆగిపోతుంది. అంతెందుకు ఎంత కోపంలో ఉన్నాసరే, ‘అది కాదు బంగారం…’ అన్న మాట వినిపిస్తే
చాలు అలక తీరిపోతుంది. ఆ మాటలోనే ఓ రిథమ్ ఉంటుంది. అంతకుమించి ఓ విలువ ఉంటుంది. ఇవేవీ కాని ఓ చనువుంటుంది. అసలు బంగారాన్నీ ఆడవాళ్లనీ విడదీయలేమేమో అనిపించేంతలా సలక్షణంగా పెనవేసుకుపోయిన ఆ రాజలోహం ఇప్పుడు సుమారు లక్ష రూపాలయ్యి కూర్చుంది. అలాగని పసిడి నగల మీద మోజు ఉన్నట్టుండి పోదే… మరిప్పుడేం చేద్దాం బంగారం?! దీనికీ ఓ ఉపాయం ఉంది. చిన్న మార్పులు చేసుకుంటే బంగారపు నగల్నే తక్కువ ఖరీదులో ధరించవచ్చు. అలా ఎలా అంటారా… ఇదిగో ఇలా!
సాధారణంగా మన దగ్గర నగలంటే 22 క్యారెట్ల బంగారమే అలవాటు. కానీ బయటి దేశాల్లో 18 క్యారెట్లు, 14 క్యారెట్ల వాడకం ఎక్కువ. అయితే ఇప్పుడు మనదేశంలోనూ ఇలా 18, 14 క్యారెట్లలో రకరకాల ఆభరణాలు తయారవుతున్నాయి. సాధారణంగా వజ్రాన్ని పట్టి ఉంచాలంటే లోహం గట్టిదనం ఎక్కువగా ఉండాలి కాబట్టి 18 క్యారెట్లదే వినియోగిస్తారు. అయితే ఇప్పుడు అన్ని రకాల నగలూ 18 క్యారెట్లలో తయారవుతున్నాయి. దాంతోపాటు, 14 క్యారెట్ గోల్డ్ కూడా బాగా ఫేమస్ అవుతున్నది. అంటే, మనకు ఏదైనా నగ నచ్చిందనుకోండి అచ్చం అలాగే అదే మెరుగుతో 14 క్యారెట్ల బంగారంతో చేసిస్తారు. నగ, నగిషీ అంతా అచ్చుగుద్దినట్టు సాధారణ బంగారం దానిలాగే ఉంటుంది. కానీ క్యారెట్లు తక్కువ కాబట్టి ఖరీదూ తక్కువ అవుతుంది.
లైట్ వెయిట్ నగల తయారీ కూడా ఈ తరహాలో ఎక్కువే. 22 క్యారెట్లలో లక్ష రూపాయలు అయ్యే నగను పద్నాలుగు క్యారెట్లలో చేయించుకుంటే సుమారు నలభై వేలలో దొరుకుతుంది. ఇలా పద్నాలుగు క్యారెట్ల నగలను ఇప్పుడు రకరకాల సంస్థలు తయారు చేస్తున్నాయి. వాళ్లే తయారుచేసిన వాటితోపాటు మనం కోరినట్టు కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తున్నారు. అయితే స్వచ్ఛమైన బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. దాని ధరను బట్టి ఒక్కో క్యారెట్ ధరనూ లెక్కిస్తారు. అదే విధానంలో 22 క్యారెట్లకు రేటు నిర్ణయించినట్టే, 14 క్యారెట్లకూ నిర్ణయిస్తారన్నమాట. దాన్ని అనుసరించే మనం చెల్లించాలి. అమ్మినప్పుడు కూడా అదే లెక్కన ధర వస్తుంది. రెండో విషయం ఏంటంటే, మనం కొనే నగ నిజంగానే పద్నాలుగు క్యారెట్లు ఉందా అన్నదీ తప్పకుండా పరీక్షించి చూసి తీసుకోవాలి. బంగారం లక్ష రూపాయలు అయింది కాబట్టి, ఇక పుత్తడి నగలు ధరించలేమేమో అన్న బెంగ అక్కర్లేదు. ఇలా క్యారెట్లను తగ్గించుకుంటే మన దగ్గర ఉన్న మొత్తంలోనే అభిరుచికి తగ్గ ఆభరణాన్ని చేయించుకుని ఎంచక్కా పెట్టుకోవచ్చు.
ఒక్కో సమస్యా పుట్టుకొస్తున్నప్పుడు దానికి వందల్లో పరిష్కారాలూ వస్తాయని చెబుతారు పెద్దలు. అదే పద్ధతిలో బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ ఆ నగలను ధరించాలన్న కోరిక తీర్చేందుకు రకరకాల విధానాలూ వస్తున్నాయి. అందులో ఒక రకమే గోల్డ్ షీటెడ్ జువెలరీ. అంటే ఈ తరహాలో నగ పైభాగంలో కనిపించేది మాత్రమే బంగారం ఉంటుంది. లోపలంతా రాగిలాంటి ఇతర లోహాలు ఉంటాయి. ఇందులో బంగారాన్ని ఒక పల్చటి రేకులా చేసి నగ పైభాగమంతా పరుస్తారు. కాబట్టి చూసేందుకు ఇది అచ్చం బంగారు నగలాగే కనిపిస్తుంది. కానీ ఒక పదిహేను గ్రాముల బరువుండే గాజులను ఈ తరహాలో కేవలం మూడునాలుగు గ్రాముల బంగారంతో చేస్తారు. అమ్మినప్పుడు మాత్రం ఇందులో సగం ధరను మనం తిరిగి పొందవచ్చు. వీటిలో కూడా మనకు నచ్చిన నగల్ని చేసిచ్చే సంస్థలు ఉన్నాయి.
బంగారం తర్వాత ఆ స్థాయి విలువ కలిగి మనం వినియోగించే లోహం వెండి. దాని ధరలూ ఇప్పుడు పైపైకి వెళుతున్నా, బంగారంతో పోలిస్తే తక్కువే. అందుకే ఇప్పుడు సిల్వర్ జువెలరీ అన్నది ఆభరణాల రంగంలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇక, ఇందులోనే బంగారు పోతపోసిన వెండి నగలనూ చాలామంది ఇష్టపడుతున్నారు. ఉంగరాలు, దుద్దుల నుంచి హారాలు, నెక్లెస్‌లు, వడ్డాణాల దాకా ఇందులో అన్ని ఆభరణాలూ తయారవుతున్నాయి. మనం బంగారంతో చేయించుకోలేని పెద్దపెద్ద నగలను ఇలా వెండిలో బంగారు నీరు పోసి చేయించుకుని ముచ్చట తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కూతుళ్లకు పెట్టే బ్రైడల్ సెట్లను ఈ తరహాలో కొంటున్నారు.
వివాహ సమయానికి వాటితో నిండుగా అలంకరించి వధువును పసిడి కాంతుల్లో మెరిసిపోయేలా చేస్తున్నారు. వీటిలో కూడా కొన్న ధరలో సగం తిరిగి వస్తుంది. హైదరాబాద్‌లాంటి పెద్ద నగరాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని మోస్తరు పట్టణాల్లోనూ ఈ పసిడి పూత పూసిన వెండి నగల దుకాణాలు వెలిశాయిప్పుడు. చుక్కలను తాకుతున్న బంగారం ధరల నేపథ్యంలో, నచ్చిన డిజైన్‌లో పసిడి మెరుపుల్లోనే ధరించాలనే కోరిక తీరేందుకు ఇదో మంచి ఎంపికగా భావిస్తున్నారు కొందరు. అదండీ సంగతి! ప్రస్తుతానికైతే పసిడి నగలు అలంకరించుకోవాలన్న కోరిక తీరేందుకు కాస్త సులువైన మార్గాలివి! అయినా నింగిలో ఉన్న సువర్ణం నిచ్చెన మెట్లు దిగి త్వరలోనే కాస్త కిందకి వస్తుందనీ చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. కాబట్టి మరీ బెంగపడకండేం!