అమ్మాయిలు ఏడ్చినా అందంగానే ఉంటారు. వినడానికి సిల్లీగా అనిపించినా.. ఈ మాటలు నిజమేనట. మనసారా ఏడిస్తే.. ముఖవర్చస్సు పెరుగుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. బాధ తగ్గిపోయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనీ, ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మారుతుందనీ చెబుతున్నారు.
బాధలో ఉన్నప్పుడు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ముఖంపై ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే బాధ తగ్గిపోయేలా ఏడిస్తే.. ఒత్తిడి దూరమై మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ పరిణామం ఆరోగ్యంతోపాటు చర్మంపైనా సానుకూల ప్రభావం చూపుతుంది. ఏడవడం వల్ల ముఖ కండరాలకు తగిన వ్యాయామం దొరుకుతుంది. ఫలితంగా చర్మం సాఫీగా కనిపిస్తుంది. అంతేకాదు.. దుఃఖంలో ఉన్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి.
ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక ఏడుస్తున్నప్పుడు ముఖంలో రక్తనాళాలు విస్తరిస్తాయి. దాంతో రక్త ప్రవాహం పెరిగి.. చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. కంటినీరు కూడా ఎక్స్ఫోలియేట్గా పనిచేస్తుందట. చర్మంలోని మృతకణాలను తొలగించి, ముఖం కాంతిమంతంగా కనిపించడానికి సహాయపడుతుందట. ఇలా ‘ఏడవడం’ శరీరానికి, మనసుకు, చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. కాబట్టి బాధలో ఉన్నప్పుడు, ఏడవాలని అనిపించినప్పుడు మనసారా ఏడవండి.