ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. మితిమీరుతున్న ఈ గ్యాడ్జెట్ల వాడకం.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయినా.. కొన్ని సందర్భాల్లో స్క్రీన్ చూడటం అనివార్యంగా మారుతున్నది. అయితే.. ఎవరి స్క్రీన్ టైమ్ ఎంత ఉండాలి? తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న సలహాలు-సూచనలు.
‘ఆధునిక టెక్నాలజీ’ మన జీవితంలో భాగమైపోయింది. దానితో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అదే స్థాయిలో సమస్యలూ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా.. పిల్లల్ని ‘స్క్రీన్టైమ్’ పట్టిపీడిస్తున్నది. అలాగని.. టెక్నాలజీని వారి జీవితంలోంచి పూర్తిగా నిషేధించడం కూడా కష్టమే! కాబట్టి, పిల్లల్ని స్క్రీన్లకు దూరం చేయడం కన్నా.. స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం మంచిది. టెక్నాలజీని సమర్థంగా వాడుకోవడంపై దృష్టి పెట్టడం ఇంకా మంచిది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు రోజుకు సగటున నాలుగు నుంచి ఆరు గంటలు స్క్రీన్లు చూస్తున్నారు. ఇక టీనేజర్లు రోజుకు తొమ్మిది గంటల దాకా స్మార్ట్ గ్యాడ్జెట్లపైనే గడుపుతున్నారు. ఇలా ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి, అన్నిటిమీదా శ్రద్ధ తగ్గిపోవడం, ఆందోళన పెరగడం, డిజిటల్ వ్యసనం లాంటి సమస్యలు వస్తున్నాయి.
అన్నిరకాల స్క్రీన్ టైమ్స్ ఒక్కటి కాదని నిపుణులు అంటున్నారు. ఆన్లైన్ తరగతులు, పిల్లల్లో జ్ఞానాన్ని పెంచే కంటెంట్ చూడటం మంచిదేనని చెబుతున్నారు. కానీ, కార్టూన్లు చూడటం, వీడియో గేమ్స్ ఆడటంతోపాటు సోషల్‌మీడియాలో గడపడం లాంటి స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలని సూచిస్తున్నారు. ఇక హింసాత్మక కంటెంట్‌ను చూసే పిల్లవాడికి.. ఆన్లైన్లో చదువుకు సంబంధించిన వర్క్‌షాప్‌లకు హాజరయ్యే పిల్లవాడికి మధ్య చాలాతేడా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు గ్యాడ్జెట్లకు బానిసలుగా మారకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. పిల్లలు ఎప్పుడూ స్క్రీన్‌తోనే గడపడం, ఆపేయమంటే కోపాన్ని ప్రదర్శిస్తుంటే.. వారు ‘స్మార్ట్ బానిసలు’గా మారుతున్నారని అర్థం. ఇలాంటి పిల్లలతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.
స్క్రీన్టైమ్ పెరిగితే.. నిద్ర సమస్యలు ఎదురవుతాయి. అలసటతోపాటు కళ్లు ఎర్రగా మారి, పొడిబారుతాయి. ఇలాంటి పిల్లలు ఆఫ్‌లైన్ ఆటలకు ఆసక్తి చూపరు. సామాజికంగానూ ఎవరితోనూ కలవకుండా.. గదిలో కూర్చొని ఫోన్‌తోనే గడుపుతుంటారు. ఇక పుస్తకాలు చదవడం, ఇతర అలవాట్లతోపాటు బహిరంగ కార్యకలాపాలపైనా ఆసక్తి కోల్పోతారు. ఎప్పుడు అడిగినా.. ‘ఇంకో ఎపిసోడ్’ అనో.. ‘మరో ఐదు నిమిషాలు’ అనో అడుగుతుంటారు.
ఈ క్రమంలో ఏ వయసు పిల్లలకు ఎంత స్క్రీన్ టైమ్ ఉండాలనే విషయంపై నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. రెండేళ్లలోపు పిల్లలకు ఎలాంటి స్క్రీన్ టైమ్ అవసరం లేదు. రెండు నుంచి ఐదేళ్లలోపు వారు రోజుకు ఒక గంటకన్నా తక్కువగానే చూడాలి. వీరికి పెద్దల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. ఇక ఆరు నుంచి 12 ఏళ్లలోపు పిల్లల స్క్రీన్టైమ్.. రోజుకు రెండు గంటలకు మించకుండా చూడాలి. ఆన్లైన్ క్లాసులు ఉంటే.. ఆ మేరకు వెసులుబాటు ఉండొచ్చు. టీనేజర్లు మూడు గంటలకన్నా ఎక్కువగా స్మార్ట్ గ్యాడ్జెట్లతో గడపొద్దు. ఈ సమయాన్ని మించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.