స్నేహితులు, బంధువులు… ఎవరైనా ఒత్తిడిలో ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల అవసరం ఏంటి అన్నది ముందుగా గ్రహించాలి. మీ నుంచి సలహాను కోరుకుంటున్నారా, బాధను చెప్పుకొనే తోడు కోసం చూస్తున్నారా అన్నది గ్రహించాలి. ఇందుకోసం మూడు విషయాలు మనసులో పెట్టుకోవాలి.
కొన్నిసార్లు ఎదుటివాళ్లు చెప్పేది వినడం అన్నదే వాళ్లకు మీరు ఇచ్చే విలువైన దన్ను. అంటే తమ బాధ న్యాయమైనదేనా, తమ నిర్ణయాలు సరైనవేనా… అంటూ వాళ్లు అడుగుతూ మీ మద్దతు కోరుకుంటుంటారు. అప్పుడు అవును… నిజమే కదా… లాంటి చిన్న మాటలు కూడా వాళ్లకు ఎంతో ఊరటను ఇస్తాయి.
కొన్నిసార్లు అవతలి వ్యక్తి కేవలం తమ సమస్యను చెప్పుకోవడం కోసం మీ దగ్గరికి రాకపోవచ్చు. వాళ్లు ఆత్మీయులుగా భావించే మీరు ఏమైనా విలువైన సలహా ఇస్తారేమో అని ఆశించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆలోచించి వాళ్ల సమస్యకు మీకు మంచిదనిపించిన సూచన చేయాలి. ఉదాహరణకు ఏదైనా హానికరమైన బంధంలో మీ మిత్రుడు చిక్కుకుపోయి బాధ పడుతుంటే, కేవలం దాని గురించి వినడం అన్నది వాళ్లకు మేలు చేయడం అవ్వదు. ఆ బంధం నుంచి భద్రంగా ఎలా బయట పడాలి, మళ్లీ వాళ్ల కాళ్ల మీద వాళ్లు ఎలా నిలబడాలి అన్న దానికి మీ వంతు మార్గం చూపాలి. అప్పుడే మీరు మంచి మిత్రులవుతారు.
స్మర్శలో చెప్పలేనంత బలం ఉంటుంది. అందులోనూ ఆత్మీయుల స్పర్శ ఒత్తిడి, ఆందోళనల నుంచి చెప్పలేనంత ఊరటనిస్తుంది. అలాంటప్పుడు వాళ్లకు దగ్గరగా కూర్చోవడం, చేతిని పట్టుకోవడం, దగ్గరి మిత్రులు, లేదా బంధువులు అయితే భరోసానిచ్చేలా ఆలింగనం చేసుకోవడం చేయాలి. ఒత్తిడిలో ఉన్న మన మిత్రులతో కలిసి సమయం గడపడం కూడా వాళ్లకు కాస్త హాయిని చేకూర్చే పనే. కాబట్టి మీ దగ్గరి వాళ్లు మీ నుంచి ఏం కోరుకుంటున్నారన్నది అర్థం చేసుకుని ముందుకు వెళితే వాళ్లు మెరుగవ్వడమే కాదు మీ బంధమూ మరింత బలపడుతుంది.