జీవనశైలి లోపాలు.. మహిళల రూపురేఖలనూ ప్రభావితం చేస్తున్నాయి. వ్యాయామం తగ్గడం.. ఒత్తిడి పెరగడం.. సరైన నిద్ర లేకపోవడం.. అన్నీ కలిసి అమ్మాయిలను ‘బెల్లీ’ బారిన పడేస్తున్నాయి. అధిక కేలరీలతో కూడిన ఆహారం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా జత కలిసి.. నడుము చుట్టుకొలతను అమాంతం పెంచేస్తున్నాయి. రకరకాల కారణాల వల్ల బెల్లీ సమస్య ఉత్పన్నం అవుతుంది. అయితే, కారణానికి తగ్గ చిట్కా వైద్యమూ ఉందండోయ్! రకరకాల టీలు పెరిగిన పొట్టను కరిగించేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
దేశంలో నాలుగన్నర కోట్ల మంది మహిళలు థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. వీరిలో అధికశాతం మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. ధనియాల టీ తీసుకోవడం వల్ల పొట్ట తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా లభించే యాంటి ఆక్సిడెంట్లు.. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.
ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య.. పీసీఓఎస్. ఈ సమస్య ఉన్నవారిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో హార్మోన్లలో తేడాలు వచ్చి.. పొట్ట పెరుగుతుంది. ఇలా వచ్చే బెల్లీని తగ్గించుకోవాలంటే.. రోజూ దాల్చిన చెక్క టీని తాగాలి. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. రక్తంలో చక్కెరను కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
ఆడవాళ్లు ఎదుర్కొనే మరో సమస్య మెనోపాజ్. ఈ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోతాయి. వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అదే సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తితోపాటు బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో పుదీనాతో చేసే పిప్పర్మెంట్ టీ బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా రక్షణ కల్పిస్తాయి.