వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటా, బయటా ఎక్కడ చూసినా తడిగానే ఉంటుంది. నిరంతరం నీళ్లలో, తేమతో కూడిన నేలపై నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికం. ఫ్లోర్ క్లీనర్లు, సబ్బు, డిటర్జంట్ వంటి వాటి తయారీలో వాడే రసాయనాల వల్ల పాదాల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ఈ టిప్స్ ఫాలో అయితే.. మీ పాదాలకు రక్షణ లభిస్తుంది.
గోరు వెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్, వెనిగర్ వేసి పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల పాదాల చర్మం మృదువుగా అవుతుంది.
పచ్చిపాలలో రెండు స్పూన్ల చక్కెర కలిపి పాదాలు, అరికాళ్లకు బాగా మర్దనా చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుని పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొడిబారిన పాదాలకు తేమ అంది మృదువుగా మారతాయి.
నిమ్మరసంలో ఒక స్పూన్ ఉప్పు కలిపి పది నిమిషాలపాటు పాదాలకు మర్దనా చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నిమ్మరసంలోని విటమిన్ సి.. యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దానివల్ల మీ పాదాలను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.
రెండు చెంచాల తేనెలో చెంచా పసుపు కలిపి పాదాలకు పట్టించాలి. అరగంటయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. పాదాలకు తేనె తేమనిచ్చి మృదువుగా మారుస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది కూడా!