ఒంటరితనం అనేది ఆధునిక జీవనం యొక్క విస్తృతమైన వాస్తవికతగా మారుతున్నది. నిరంతర ఒంటరితనం అనేది ఒక మానసిక స్థితికి దారితీస్తుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు తనలోని అనుభవాలను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయని నిపుణులు సెలవిస్తున్నారు.
చాలా మంది బిజీగా ఉన్నట్లు కనిపించే పరిస్థితిలో వారు తమను తాము కనుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ప్రతికూలంగా ఆలోచించడం , తక్కువ మానసిక స్థితికి దారితీస్తుంది. ఫలితంగా వారి జీవితం అర్థాన్ని, ఉద్దేశాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. తద్వారా వారు గుణాత్మకంగా మెరుగుపడే మార్గాల గురించి ఆలోచించడం మానేస్తారు. ఇలా ఒంటరితనం అనుభవిస్తున్నవారు కొన్ని సులభమైన మార్గాలను అనుసచరించడం ద్వారా మెరుగైన జీవితాన్ని లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ మార్గాలేవంటే..
1. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ ఒంటరితనం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైందనే విషయాలను సంగ్రహించండి. దానిని సమర్ధంగా పరిష్కరించుకునేందుకు మరింత స్పృహతో సంఘటిత ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.
2. వాస్తవ ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి చురుగ్గా ప్రయత్నించండి. వర్చువల్ ప్లాట్‌ఫాంలు, స్పేస్‌ల కోసం ఎక్కువ సమయం వెచ్చించకుండా వాస్తవ ప్రపంచంలోని వ్యక్తులతో సన్నిహితంగా మెలిగేలా సమయం కేటాయించండి. మీమీ గాడ్జెట్లను ఎంత మేరకు వాడాలో.. ఎక్కడ వాడాలో ఆ మేరకే వాడేలా ప్రణాళికలు తయారుచేసుకుని అమలుచేసుకోండి. ఇల్లు, ఆఫీస్‌లో కూడా స్నేహసంబంధాలు మెరుగ్గా ఉన్నప్పుడే మంచి ఫలితాలను రాబట్టగలుగుతాం.
3. మీ సంబంధాలను నాణ్యమైనవిగా తయారుచేసుకునేందుకుగాను ఎదుటి వారి నుంచి తీసుకోవడమే కాకుండా వారికి ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా ఇస్తూ తీసుకోవడంలో నిజమైన సంతోషాన్ని పొందినప్పుడే బంధాలు మరింత బలపడతాయి. ఎదుటివారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని మసలుకోవడం ద్వారా వారితో పాటు మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం.
4. ఇతరులతో కలిసి పనిచేయడంలో ఎంతో సంతోషం ఉంటుంది. కలిసి పనిచేయడంలో విజయాలుంటాయి. ఇలాంటి సామూహిక కార్యకలాపాల కోసం సమయాన్ని వెచ్చించండి. ఇలాంటి పనులు మన జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. సంఘం, సమాజం, మండలి సభ్యులతో సమయం వెచ్చించడం ద్వారా వారి సమస్యలను వినేందుకు తద్వారా మన సమస్యలను షేర్ చేసుకునేందుకు ఒక ప్లాట్‌ఫాం లభిస్తుంది. ఈ సభ్యుల్లో ఎవరో ఒకరు మంచి సూచన మన జీవితాన్నే మార్చేయగలదని నమ్మండి.
5. మీరు జీవిస్తున్న మార్గాలను గుర్తుంచుకోండి. రోజువారీ జీవితంలోని అనుభవాల్లో మునిగిపోవాలి. విభిన్న కార్యకలాపాల్లో మునిగితేలుతున్న క్షణాలను ఆస్వాదించండి. ఏ సమయంలోనైనా మీరు చేస్తున్న పనులతో మీతోపాటు ఇతరులకు కూడా ఏదో ఒక రూపంలో లబ్ధి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనం, ఎదుటివారు సంతోషం చెందుతారు. మనతో, మన ఆలోచనలను షేర్ చేసుకోవడానికి వారు కూడా సమయం కేటాయిస్తారు. ఫలితంగా మనలో ఒంటరి అనే భావన పారిపోతుంది.
వీటితోపాటు మనకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమవ్వాలి. మనసుకు హాయినిచ్చే ఏ పనైనా ఇష్టంగా చేపట్టి మనశ్శాంతిని పొందాలి. అది వంట పని చేయడం, తోట పని చేయడం, ఆర్ట్ వేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, డ్యాన్స్ చేయడం.. వంటి వాటి ద్వారా మనశ్శాంతి పొందవచ్చు. వాలంటీర్‌గా పనిచేయడం, ఉపాధ్యాయురాలుగా సేవలందించడం, సంఘసేవలో పాలుపంచుకోవడం, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనలో ఒంటరితనం అనే జాఢ్యాన్ని పారిపోయేలా చేసుకోవచ్చునని మరిచిపోవద్దు.