Glass Sand Painting | తివిరి ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు… తిరిగి ఇసుక నుంచి చిత్రంబు గీయవచ్చు… అని చెప్పుకోవాలి గ్లాస్ సాండ్ ఆర్ట్ చూసిన ఎవరైనా. రంగుల ఇసుకతో అందమైన పెయింటింగ్స్ సృష్టిస్తారిందులో. కుంచెల అవసరం లేదు, కాన్వాస్ అక్కర్లేదు. గాజు గ్లాసే ఇక్కడ చిత్రాన్ని చూపే తెర. అందులో ఇసుక బొమ్మను ఆవిష్కరించడమే ఈ కళ.కావల్సింది చారెడు ఓపిక, గుప్పెడు సృజన, దోసెడు ఇసుక… అంతే!
ఇసుక తిన్నెలెప్పుడూ పాటల్లో పల్లవిస్తుంటాయో… పాటలెప్పుడూ ఇసుక తిన్నెల చుట్టూ తారాడుతుంటాయో తెలియదు కానీ యమునా తీరమూ, సంధ్యారాగంలాఒకదానికొకటి ముడిపడే ఉంటాయి. మసక వెన్నెల వేళ ఇసుకతిన్నె చేరిన మనసేదో అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని సైకత చిత్రంగా మార్చాలని మోజు పడ్డదేమో! అదే కల.. అందమైన కళగా, ‘గ్లాస్ సాండ్ పెయింటింగ్ ( Glass Sand Painting )’గా మారిపోయి మదిని మాయ జేస్తున్నది. ఆకట్టుకునే వన్నెలూ, అచ్చెరువొందించే చిత్రాలూ.. అచ్చంగా ఇసుకను పోసి చేసినవంటే నమ్మబుద్ధి కానంతగా మురిపిస్తున్నాయి.

Sand Art8
అందమైన దృశ్యాన్ని చూస్తే ఎలాంటి భావన కలుగుతుందో, ఇష్టమైన వారి చిత్రాన్ని చూసినా మనసుకు అదే అనుభూతి కలుగుతుంది. అందుకే సాండ్ ఆర్టిస్టులు కస్టమైజ్డ్ సాండ్ పోర్ట్రెయిట్లనూ రూపొందిస్తున్నారు. ఇందులో అచ్చం మన పెయింటింగ్ వేసినట్టు కనిపించేలా ఇసుకతో చిత్రాన్ని తయారు చేస్తారు. ఇందుకోసం పారదర్శక గాజు ఫ్రేమ్‌ను ఎన్నుకుంటారు. జాగ్రత్తగా గమనిస్తే తప్ప.. అది రంగులతో గీసిన పెయింటింగ్ కాదు, ఇసుక చిత్రమని అర్థం కానంత సునిశితంగా సాండ్ పెయింటింగ్స్ ఉంటాయి. ఈ తరహా చిత్రాలు మనకూ కావాలనుకుంటే సాండ్అండ్ఆర్ట్.కామ్లాంటి వెబ్సైట్లలోకి వెళ్లి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ప్రేమగా పెంచుకునే పిల్లులూ కుక్కల బొమ్మలను కూడా ఇలా చిత్రిస్తున్నారు. ఇంట్లో అలంకరించుకున్నా, ఇష్టమైన వారికి బహుమతిగా ఇచ్చినా అందంగానే ఉంటాయి. ఈసారి ఇసుకలో పేరు రాసే కాదు, బొమ్మవేసి మరీ ప్రేమను చాటుకోవచ్చు!

కళ ఏదైనా స్ఫూర్తి ప్రకృతే. అందుకే సాండ్ పెయింటింగ్స్‌లోనూ ప్రకృతి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. గులాబీ వన్నెల సూర్యోదయాలూ, గుంపులుగా ఎగిరే పక్షులూ, గాలికి వాలే చెట్లకొమ్మలూ దర్శనమిస్తాయి. వయ్యారంగా పారే సెలయేళ్లూ, వాటి వాలుగా సాగే నావలూ, అందమైన తీరాలూ.. వీటిలో ఉంటాయి. ఆరు రుతువుల సౌందర్యాన్ని కాన్వాసు మీద చిత్రకారులు ఎంత సహజంగా గీసి చూపిస్తారో.. దానికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ ఇసుక సాయంతో గాజులోపల ఆ దృశ్యాలను ఆవిష్కరిస్తారు సాండ్ ఆర్టిస్టులు. ఇసుక పెయింటింగ్స్‌ను చిత్రించడానికి ముందుగా రంగురంగుల ఇసుకను తీసుకుంటారు. అక్కడ రావాలనుకున్న చిత్రాన్ని బట్టి రంగులను ఎంచుకుంటారు. ఆ ఇసుకను గరాటు సాయంతో ఒకదాని తర్వాత ఒకటి వరుసలుగా పోస్తారు. ఒక పొడవాటి పుల్లలాంటి దాన్ని కిందకీ పైకీ కదుపుతూ ఇసుకను పొరల మధ్య జాలువారేలా చేస్తూ అనుకున్న చిత్రాన్ని తీసుకువస్తారు. ఇందుకోసం గాజుగ్లాసులు, గుండ్రంగానో, బిందువు ఆకారంలోనో ఉండే పారదర్శక జార్లలాంటి వాటిని ఎన్నుకుంటారు. రకరకాల డిజైన్లు, కార్టూన్లలాంటివీ వీటిలో రూపొందిస్తారు. కావాలంటే పేర్లనూ, శుభాకాంక్షలనూ జోడిస్తారు.


Sand Art1

Sand Art2

Sand Art3

Sand Art4

Sand Art5

Sand Art6

Sand Art7

Sand Art9

Sand Art10

Sand Art11
“Antique Photo Frames | పాత ఫొటోలు, పెయింటింగ్స్‌ను ఇలా కొత్తగా మార్చేసుకోండి”