ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. సమయానికి తినలేకపోతున్నారు. బయటి తిండి, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. ‘అసిడిటీ’ బారినపడుతున్నారు. కడుపులో మంట, కడుపుబ్బరం, హార్ట్‌బర్న్ లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు దుకాణాల్లో దొరికే అసిడిటీ రెగ్యులేటర్లను ఆశ్రయిస్తుంటారు. ఇన్స్టంట్ రిలీఫ్ పొందుతుంటారు. అయితే, ఇలా అసిడిటీ రెగ్యులేటర్లను రెగ్యులర్‌గా వాడితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసిడిటీ సమస్యలు గతంలోనూ ఉండేవి. కానీ, అప్పటివాళ్లు జీలకర్ర, అల్లం, సోంపు, పెరుగు లాంటివి తీసుకొనేవారు. సహజసిద్ధమైన ఈ ఉత్పత్తులు అసిడిటీని తగ్గించడంతోపాటు ఆరోగ్యానికీ హామీ ఇచ్చేవి. కానీ, ఇప్పుడు కాలం మారింది. ఇప్పటివాళ్లు అప్పటికప్పుడే ఉపశమనం పొందడానికి మార్కెట్లలో లభించే యాంటాసిడ్లను ఆశ్రయిస్తున్నారు. ఇవి కొన్ని నిమిషాల్లోనే కడుపు మంటను తగ్గిస్తాయి. కానీ, కొందరు వీటిని రెగ్యులర్‌గా వాడుతుంటారు. అలాంటి వాళ్లలో.. ఈ అసిడిటీ రెగ్యులేటర్లు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పేగుల ఆరోగ్యంతోపాటు జీర్ణవ్యవస్థనూ దెబ్బతీస్తాయి.
పరిశ్రమలో తయారయ్యే అసిడిటీ రెగ్యులేటర్లలో సిట్రిక్ యాసిడ్, సోడియం బైకార్బొనేట్ లాంటివి కలుపుతారు. ఇవి కడుపులో సహజంగా ఉత్పత్తయ్యే ఆమ్లాలపై ప్రభావం చూపుతాయి. వాటి ఉత్పత్తి తగ్గుతుంది. దీర్ఘకాలంపాటు వాడితే.. జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది. దాంతో, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే.. ఇలాంటి యాంటాసిడ్స్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి, సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అసిడిటీ రెగ్యులేటర్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా.. సహజసిద్ధమైన యాంటాసిడ్లను వాడటం మంచిదని చెబుతున్నారు.
ఆహారం జీర్ణం కావడాన్ని వేగవంతం చేయడంలో.. ఆపిల్ సైడర్ వెనిగర్, అజ్వైన్, అల్లం, రాక్ సాల్ట్ సమర్థంగా పనిచేస్తాయి. భోజనానికి ముందు వీటిని కొద్దిగా తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. ఇక భోజనాన్ని బాగా నమిలి తినడం, చల్లని నీటిని దూరం పెట్టడం కూడా మంచి అలవాటు. కొబ్బరి నీళ్లు, మెంతి నీళ్లతోపాటు హెర్బల్ టీ కూడా.. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను
వేగవంతం చేసి.. అసిడిటీని తరిమేస్తాయి.