నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు. తాము పడ్డ ఇబ్బందులు.. తమ బిడ్డలు పడకూడదని భావిస్తున్నారు. అయితే, పిల్లలకు ఇలా అవసరాలకు మించిన సౌకర్యాలను కల్పించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కష్టం విలువ తెలియకుండా పెంచడం వల్ల వారిలో సర్దుకుపోయే స్వభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇలాగే పెరిగితే.. వారి భవిష్యత్తుపైనా ప్రభావం పడుతుందని అంటున్నారు.
పిల్లలు అడగకముందే అన్నీ కొనివ్వడం కాదు.. వాళ్లు అడిగింది కొనివ్వడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అది చిన్న ఆట బొమ్మ అయినా.. పెద్ద వస్తువైనా అవసరమైతేనే తీసుకోవాలి. అది కూడా కొన్ని షరతులు విధించి మరీ అందివ్వాలి. పిల్లలు కోరిన వస్తువు దక్కాలంటే.. వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. ఇంటి పనులు చేసి పెట్టడమో.. పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమో.. ఇలాంటి టార్గెట్లు విధించాలి. వాటిని పూర్తి చేస్తేనే.. ఆయా వస్తువులు కొనిస్తామని చెప్పాలి. అప్పుడే.. ఏదైనా కావాలంటే కష్టపడాల్సిందే అన్న విషయం పిల్లలకు అర్థమవుతుంది. ఇక కొందరు పిల్లలు మరీ మంకుపట్టు పడుతుంటారు.
తమకు అవసరం లేదని తెలిసినా.. కొనివ్వాల్సిందేనని భీష్మించుకుంటారు. వారి అల్లరి భరించలేకో, ఏడుపు ఆపాలనో కొనివ్వడం మొదలుపెట్టారో.. వాళ్లు దాన్నే అలుసుగా తీసుకుంటారు. మీ బలహీనతను తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అందుకే, ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా ‘నో’ చెప్పేయండి! ఏడ్చినా, మంకుపట్టు పట్టినా.. కొద్దిసేపే ఉంటుంది! మరీ శ్రుతిమించితే.. వారికి అవసరమైన వేరే వస్తువును కొనివ్వండి. ఖరీదైన వస్తువుల విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవ్వండి. తక్కువ ధరలోనూ ఎక్కువ సంతృప్తిని ఇచ్చే విధానాలను వారికి పరిచయం చేయాలి. అప్పుడే పిల్లలకు డబ్బు విలువ, జీవితం విలువ తెలిసొస్తుంది.