ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు పెద్దపెద్ద వృక్షాలే వాడిపోతున్నాయి. ఇక పెరటి మొక్కల సంగతి వేరే చెప్పాలా? ఈ క్రమంలో పెరటి మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవికాలమని కుండీల్లోని మొక్కలకు అదేపనిగా నీరు పోస్తుంటారు కొందరు. ఇది మొక్కకు చాలా కీడు చేస్తుంది. మొక్కల వేర్లు మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ మిట్టమధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు పెట్టవద్దు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాతే మొక్కలకు నీళ్లు పోయాలి. ఈ సమయమైతేనే.. నీళ్లు నేలలోకి ఇంకిపోవడానికి, వేర్లను చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
పెరటి తోటకు కలుపు మొక్కలు చేసే నష్టం అంతా ఇంతా కాదు. పోసే నీరు, వేసే ఎరువులో సింహభాగం.. అవే స్వీకరిస్తాయి. పెరటి మొక్కలను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి, మొక్కల సంరక్షణలో మొదట చేయాల్సిన పని ‘కలుపు’ను ఏరివేయడం. ముఖ్యంగా కుండీలలో మీరు పెంచే మొక్క కాకుండా.. ఇంకా ఏ విధమైన మొక్కలు పెరిగినా వెంటనే తీసేయండి. అప్పుడు.. మీ మొక్కలకు బాగా పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి.
వసంత మాసంలో మొక్కల పెరుగుదల ఎక్కువ. ఈకాలంలో చీడపీడల బాధ తక్కువ. కాబట్టి, మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుంటాయి. కాబట్టి, మొక్క మరింత ఆరోగ్యకరంగా ఉండాలంటే.. కత్తిరింపులు చేయాలి. క్రాసింగ్, దెబ్బతిన్న కొమ్మలు ఉంటే, వాటిని తొలగించాలి.
మొక్కలు బాగా ఎదగాలని ఏ ఎరువులు పడితే అవి.. పరిమితికి మించి వాడటం మంచిదికాదు. మొక్కలకు సరిపోయేదే ఎన్నుకోవాలి. నత్రజని ఆధారిత ఎరువులు వేసవికి అనుకూలంగా ఉండటంతోపాటు మొక్కల పెరుగుదలనూ ప్రోత్సహిస్తాయి.