ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పెంపకం రేసులా మారింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. తమ పిల్లలు అందరికన్నా తెలివిగా ఉండాలని, సూపర్కిడ్గా ఎదగాలనే తాపత్రయంతో పేరెంటింగ్ పట్టాలు తప్పుతున్నది. ఈ క్రమంలో ప్రతి ఇంట్లోనూ అరిచే తల్లిదండ్రులు, అలిగే పిల్లలు కనిపిస్తున్నారు. ఈ తరహా పేరెంటింగ్ వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణుల మాట. దీనికి పరిష్కారమే ‘మైండ్‌ఫుల్ పేరెంటింగ్’.
ఈ విధానం ఒత్తిడిని దూరం చేసి, ప్రశాంతతను, అనుబంధాన్ని పెంచుతుంది. ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరించడం అలవాటు చేయడమే ఇందులోని కిటుకు. పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఆడుకునేటప్పుడు పూర్తిగా అక్కడే ఉండటం.. అంటే వారితో సింక్ అయిపోవాలి. ప్రతి చిన్న విషయానికీ జడ్జ్ చేయకుండా, వారి భావాలను అర్థం చేసుకోవడమే మైండ్‌ఫుల్ పేరెంటింగ్. దీంతో పిల్లలు చెప్పకుండానే తల్లిదండ్రుల దారిలోకి వస్తారు. పేరెంట్స్ కూడా ప్రశాంతంగా ఉంటారు.
ఫోన్ పక్కన పెట్టండి: ఫ్యామిలీ సమయం గడుపుతున్నప్పుడు ఫోన్‌ను దూరంగా ఉంచండి.
సానుభూతి చూపండి: పిల్లలు బాధగా లేదా కోపంగా ఉన్నప్పుడు సానుభూతిని చూపండి. ఓపికగా వారితో మాట్లాడండి.
మార్గదర్శనం: పిల్లలను నియంత్రించడానికి బదులు, వారికి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి ప్రయత్నించాలి.
ఒత్తిడికి లోనవ్వద్దు: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులూ ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే ధ్యానం లాంటివి సాధన చేయండి.