జుట్టు ఆరోగ్యం కోసం చేసే మొదటి పని.. నూనె పెట్టుకోవడం. దీనివల్ల వెంట్రుకలకు కావాల్సిన పోషణ అందుతుంది. జుట్టు తళతళా మెరిసిపోతుంది. ఇక పొడిబారిన జుట్టుకైతే.. నూనె దివ్యౌషధమే! అయితే.. కొందరు నూనె పెట్టుకోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడక పోగా.. చుండ్రు, దురదతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఈ క్రమంలో జుట్టుకు నూనె ఎలా పెట్టుకోవాలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
నూనె పెట్టుకోవడం అంటే.. తలంతా పూసేయడం కాదు. కుదుళ్లకు పట్టేలా మసాజ్ కూడా చేయాలి. అప్పుడే నూనె పెట్టే ప్రక్రియ పూర్తయినట్టు లెక్క. మసాజ్ చేయడం వల్ల జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అదికూడా.. 5 నుంచి 10 నిమిషాల సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది.
కొబ్బరినూనె పెట్టుకోవడానికి ముందు.. దాన్ని గోరువెచ్చగా వేడిచేయాలి. అప్పుడే.. నూనె మాడులోకి ఇంకుతుంది. పోషకాలన్నీ కుదుళ్ల వరకూ వెళ్తాయి.
ఇక నూనె పెట్టగానే తల దువ్వుకోవడం మంచిదికాదు. నూనె పెట్టడం వల్ల వెంట్రుకల మొదళ్లు బలహీనపడతాయి. అలాంటి సమయంలో దువ్వడం, చిక్కులు తీయడం చేస్తే.. జుట్టు రాలిపోతుంది. దువ్వెనకు బదులుగా.. చేతి వేళ్లతోనే మెల్లగా చిక్కులు తీసుకోవడం మంచిది. జడను కూడా మరీ బిగుతుగా కాకుండా.. వదులుగా వేసుకోవాలి.
నూనె పెట్టుకున్న వెంటనే షాంపూతో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగని.. రాత్రంతా అలాగే వదిలేయడమూ మంచిదికాదు. కనీసం గంట నుంచి రెండున్నర గంటల వరకు ఉంచుకోవడం బెటర్. అప్పుడే పోషకాలన్నీ కురులకు అందుతాయి. లేకుంటే.. నెత్తిలో దుమ్ము, సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంటుంది. చుండ్రు రావడానికి, వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది.
చుండ్రు సమస్య ఉంటే.. నూనెకు దూరంగా ఉండటమే మంచిది. అలాంటి సమస్య ఉంటే.. మాడుకూ, జుట్టుకు తేమను అందించే హెయిర్ మాస్కులు వేసుకోవాలి.