అమ్మాయిలకు వ్యాయామం.. అనేది అందని ద్రాక్షగానే మిగులుతున్నది. కుటుంబ కట్టుబాట్లు, అభద్రత.. వారిలో వ్యాయామంపై ఆసక్తి తగ్గిస్తున్నది. ‘టైమ్ యూజ్ ఇన్ ఇండియా-2024’ నివేదిక.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఫిట్‌నెస్‌లో మహిళలు-పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 4,50,000 మందికి పైగా ప్రజలను అధ్యయనం చేశారు. 1529 సంవత్సరాల మహిళల్లో 3.9 శాతం మంది మాత్రమే రోజువారీ క్రీడలు, వ్యాయామంలో పాల్గొంటున్నట్లు గుర్తించారు. అదే పురుషులలో 14.8 శాతం మంది నిత్యం ఆటలతోపాటు వ్యాయామం ద్వారా ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు.
ఇక వ్యాయామం చేసే సమయంలోనూ లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తున్నది. యువతులు రోజుకు సగటున 46 నిమిషాల చొప్పున వర్కవుట్లకు కేటాయిస్తున్నారు. అదే పురుషులు 64 నిమిషాలు జిమ్‌లు, గ్రౌండ్లలో గడుపుతున్నారు. ఈ 18 నిమిషాల అంతరం మరీ ఎక్కువగా కనిపించపోవచ్చు. కానీ, వారాలు, నెలల్లో.. ఆడవాళ్ల ఫిట్‌నెస్‌లో గణనీయమైన వ్యత్యాసానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణాలను అధ్యయనకారులు వివరించారు. క్రీడలు, ఫిట్నెస్ కంటే మహిళలు ఎక్కువగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణకే పరిమితమై పోతున్నారు.
ఇంటి పెద్దలతోపాటు సాంస్కృతిక నిబంధనలు కూడా వారికి వ్యతిరేకంగానే ఉన్నాయి. 13 ఏళ్లు దాటిన తర్వాత బాలికలు బహిరంగ వ్యాయామాలు, ఆటలకు దూరం అవుతున్నారు. అదే సమయంలో చాలా కుటుంబాలు అబ్బాయిలను ఆటల్లో ప్రోత్సహిస్తున్నాయి. అమ్మాయిలు మాత్రం ఇంట్లోనే ఉండాలని, చదువులపై దృష్టిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. మెట్రో నగరాల్లో ఈ మనస్తత్వం ఇప్పుడిప్పుడే మారుతుండగా.. చిన్నస్థాయి పట్టణాలు, పల్లెల్లో ఈ వివక్ష ఇంకా తీవ్రంగానే ఉన్నది. ఇక బహిరంగ ప్రదేశాల్లో భద్రత లేకపోవడం కూడా మహిళలు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోవడానికి మరో కారణం. పార్కులు, ఆట స్థలాల్లో ఆధిపత్యమంతా పురుషులదే! దాంతో, చాలామంది మహిళలు బహిరంగంగా వ్యాయామం చేయడం సురక్షితం కాదని భావిస్తున్నారట.
ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రిపూట.. వారు వ్యాయామానికి దూరం అవుతున్నారట. అయితే, ఫిట్నెస్ కాపాడుకోవడం అనేది.. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, ఒత్తిడి ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. యుక్తవయసులో ఫిట్నెస్ బలహీనంగా ఉంటే.. అది వారి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రోజువారీ వ్యాయామం.. మహిళల జీవనశైలి వ్యాధులను నివారించడంతోపాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పుకొస్తున్నారు.