ఉరుకులు పరుగుల జీవితం.. కొందరిని వీకెండ్ వారియర్లుగా మార్చేస్తున్నది. ఏ పని పూర్తిచేయాలన్నా.. శని, ఆదివారాల కోసమే ఎదురు చూడాల్సి వస్తున్నది. చివరికి వ్యాయామం కూడా.. వారాంతాలకే పరిమితం అవుతున్నది. అయితే.. ఈ వారాంతపు వ్యాయామం కూడా మంచి ఫలితాలే ఇస్తున్నదని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది.
వారానికి 150 నిమిషాలు (రోజుకు 30 నిమిషాలు – 5 రోజులపాటు) వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ (సీడీసీ) సూచనలు చెబుతున్నాయి. అయితే, వారంలో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ 150 నిమిషాల వ్యాయామం చేసినా అవే ఫలితాలు కనిపిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. నిత్యం వ్యాయామం చేసేవారితో పోలిస్తే.. వారాంతాల్లో వ్యాయామం చేసేవారు దాదాపు 264 వ్యాధుల బారినుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం లాంటి వ్యాధులు కూడా దూరమవుతాయని అంటున్నారు.
పరిశోధనలో భాగంగా 89,573 మందికి చెందిన ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి డేటాను సేకరించారు. వీరిలో 30,228 మంది అరుదుగా వ్యాయామం (వారానికి 150 నిమిషాల కంటే తక్కువ) ఉండగా.. 37,872 మంది వారాంతాల్లో వ్యాయామం (ఒకటి, రెండు రోజుల్లో 150 నిమిషాలు) చేసేవారు.. మరో 21,473 మంది నిత్య వ్యాయామం (వారంలో కనీసం 150 నిమిషాలు) చేసేవారు ఉన్నారు. వారి ఫిట్నెస్ ట్రాకర్ల డేటా ఆధారంగా.. వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేశారు. ఈ సందర్భంగా వారాంతాల్లో వ్యాయామం చేసేవారు కూడా నిత్యం వ్యాయామం చేసేవారితో సమానంగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారని తేల్చారు. వారిలోనూ గుండెపోటు వచ్చే ప్రమాదం 27 శాతం, బ్రెయిన్ స్ట్రోక్ 21 శాతం, మధుమేహం 43 శాతం తగ్గుతుందని వెల్లడించారు. వారంలో 150 నిమిషాల వ్యాయామం అనేది ఒక మ్యాజిక్ నంబర్ లాంటిదనీ, దాన్ని వారంలో ఎప్పుడు దాటినా మంచి ఫలితాలే ఉంటాయని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.