రోడ్ల మీద గుంతలు చూడటానికి చిన్నగా అనిపించినా… అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చిన్న గుంతలు పెద్దవైతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వానకాలంలో అయితే నీళ్లతో నిండి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తాయి. దోమలు, ఈగలకు నెలవైపోయి రోగాలకు పుట్టినిల్లుగా మారిపోతాయి. కర్ణాటక రాష్ట్రం మాండ్యలో హోలాలు సర్కిల్ దగ్గర రోడ్లు గుంతలతో దుర్భరంగా తయారయ్యాయి. గుంతల కారణంగా వాహనదారులు నిత్యమూ అనుభవించే నరకాన్ని అక్కడి సెంట్రల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వర్ష బీవీ గమనించారు. ధ్వంసమైపోయిన రోడ్డును సొంత ఖర్చుతో బాగుచేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తానే స్వయంగా పనివాళ్లను పిలిచారు. టిప్పర్లను అద్దెకు తీసుకున్నారు. అలా రోడ్ల మీది గుంతల్ని పూడ్చేయించారు. పౌరుల భద్రతకు భరోసా ఇచ్చారు. వర్ష చూపిన చొరవ స్థానికుల నుంచి ప్రశంసల వర్షం కురిపించింది.
“రోడ్ల మీది గుంతల కారణంగా ప్రజలు రోజూ అవస్థలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. ప్రభుత్వ ఉద్యోగిగా పరిస్థితిలో మార్పు తీసుకురావడం నా కర్తవ్యంగా భావించాను” అంటారు వర్ష. అంతేకాదు, ఇకముందు కూడా ప్రజల మేలుకోసం తాను చేయగలిగినంత చేస్తానని నిశ్చయంగా చెబుతారామె. ఇక వర్ష ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు. రెండేండ్ల కింద ఆమె సబ్ ఇన్స్పెక్టర్గా చేరిన సంఘటన కూడా చెప్పుకోదగిందే. అప్పుడు ఆమె సబ్ ఇన్స్పెక్టర్ అయిన తన తండ్రి బీఎస్ వెంకటేశ్ చేతుల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అంటే తండ్రికి బదిలీ కావడంతో అదే స్టేషన్కు బిడ్డ ఎస్ఐగా వచ్చిందన్నమాట. ఇక సమాజ శ్రేయస్సు ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్థం చేసుకోవడానికి వర్ష లాంటివారే స్ఫూర్తి. వర్ష పనితీరును చూసిన స్థానికులు ఇతర ప్రభుత్వ అధికారుల వైపు కూడా మార్పు కోసం ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజల కష్టాలను తొలగించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న వర్షకు హ్యాట్సాఫ్!