నిన్న మొన్నటి వరకు మనపై టీవీల్లో వచ్చే ప్రకటనలు ప్రభావం చూపించేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని సోషల్ మీడియా భర్తీ చేస్తున్నది. సోషల్ మీడియా కారణంగా భోజనం మానేసి స్నాక్స్‌కు జనం జైకొడుతున్నారు. కొత్తకొత్త స్నాక్స్ కోసం వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వెదుకుతున్నారు. కొత్తగా కనిపించే టిఫిన్లు, స్నాక్‌లను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఆరగిస్తూ ఆనందపడుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య మన దేశంలో 81 శాతం వరకు ఉండటం విశేషం. స్టేట్ ఆఫ్ స్నాకింగ్ పేరుతో మోండెలెజ్ ఇంటర్నేషనల్, ది హారిస్ పోల్ సంయుక్తంగా అధ్యయనం చేపట్టాయి.
భారతదేశంలో ప్రతి 10 మందిలో 8 మంది రోజుకు ఒకసారి స్నాక్స్ తినడానికి ఇష్టపడతారని వీరి అధ్యయనంలో తేలింది. చాలా మంది సాయంత్రం పూట స్నాక్స్ తింటారు.
కరోనా మహమ్మారి కూడా ఈ అభిరుచిని పెంచింది. 83 శాతం భారతీయులు గత మూడేండ్లలో వివిధ కొత్త రకాల స్నాక్స్ తినడం ప్రారంభించిన విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది.
అలాగే, 92 శాతం మంది భారతీయులు సోషల్ మీడియాలో ఫుడ్ కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 62 శాతంగా ఉన్నది.
గత ఏడాది సోషల్ మీడియా స్ఫూర్తితో 77 శాతం మంది కనీసం ఒక కొత్త చిరుతిండిని తినేందుకు ప్రయత్నించారంట. ప్రపంచవ్యాప్తంగా ఈ రేటు 55 శాతంగా ఉన్నది.
కాగా, 80 శాతం మంది స్నాక్స్ తినడం తమ సామాజిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. అంటే వీరు ఆహారం ద్వారా ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతున్నారు.
దేశంలో ఈ-కామర్స్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల్లో కూడా చిరుతిళ్లు తినే అలవాటు పెరుగుతున్నదని మాండెలెజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ విశ్వనాథన్ తెలిపారు. అయితే, ఇదే సమయంలో చిరుతిళ్లను రెగ్యులర్‌గా తినడం వల్ల ఊబకాయం వస్తుందనేది మరిచిపోవద్దు. అలాగే, ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాల వల్ల కూడా దీర్థకాలంలో మన ఆరోగ్యానికి హానికరం అని గుర్తించాలి. చిరుతిళ్లతో కడుపు నింపుకుంటూ ప్రజలు ఇంటి భోజనం మానేస్తున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాల కొరత ఏర్పడి అనారోగ్య సమస్యలు బయటపడతాయి.