గుడ్లపై కోడిపెంట కనిపించడం మామూలు విషయమే! పౌల్ట్రీ ఫారం నుంచి కొనుగోలు చేసే కోడిగుడ్లు అపరిశుభ్రంగానే ఉంటాయి. దాంతో, చాలామంది కోడిగుడ్లను కడుగుతుంటారు. అయితే, ఇలా చేయడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లను కడగకుండా ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు. కోడి గుడ్డు పెట్టినప్పుడు దానిపైన సహజంగానే ‘బ్లూమ్’ అని పిలిచే ఒక రక్షిత పొర ఏర్పడుతుంది.
గుడ్డు లోపలికి బ్యాక్టీరియా వెళ్లకుండా ఈ పొర రక్షణగా నిలుస్తుంది. అయితే, కోడిగుడ్లను నీటితో శుభ్రంగా కడిగినప్పుడు మురికితోపాటు సూక్ష్మమైన ‘బ్లూమ్’ పొర తొలగిపోతుంది. దాంతో, గుడ్లలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఫలితంగా అవి త్వరగా పాడవ్వడంతోపాటు అనారోగ్యానికీ కారణం అవుతాయి.
కాబట్టి, కోడిగుడ్లను నిల్వ చేయడానికి ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ కడగకూడదని నిపుణులు సూచన చేస్తున్నారు. ఒకవేళ మురికిగా కనిపిస్తే.. శుభ్రమైన తడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అయితే, వంట చేయడానికి ముందు కడిగితే ఫర్వాలేదట. కడిగిన తర్వాత వెంటనే వాడాలనీ, ఎక్కువసేపు నిల్వ చేయవద్దని అంటున్నారు.