ఉడుకు అన్నం మీద అపారమైన ప్రేమ శీతాకాలంలోనే వస్తుంది. పొగలు కక్కే చాయ్‌తో దోస్తానా ఇప్పుడే ఎక్కువ అవుతుంది. నూనెలోంచి నేరుగా నోట్లోకే వెళుతున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది వేడివేడి బజ్జీల పరిస్థితి. అందుకే ఈ సమయంలో సాధారణంగానే చల్లకు చెల్లుచీటీ ఇచ్చేస్తాం. పెరుగంటేనే పరుగందుకుంటాం. దహీ తింటే కఫం చేరుతుందన్న నమ్మకమూ దీనికి తోడవడంతో ఉష్ణోగ్రతలతో పాటే దీనికి డిమాండూ పడిపోతుంది. అందుట్లోనూ రాత్రి పూట పెరుగు అసలు తినొద్దు అని ఆయుర్వేదం చెప్పిందంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం. కానీ, అందులో పెద్దగా నిజం లేదని చెబుతున్నారు నవతరం పోషకాహార నిపుణులు. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. చల్లటి వాతావరణంలో రోగాలు దాడిచేసే ఈ సమయంలో శరీరానికి పెరుగు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. పెరుగు ప్రొబయాటిక్గా పనిచేస్తుంది. అంటే పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇందులో క్యాల్షియం, భాస్వరం, పొటాషియంలతోపాటు ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. జీర్ణాశయ ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. కాబట్టి అరుగుదల సమస్య లేకపోతే చాలు, ఎంచక్కా పెరుగును రెండు పూటలా తినొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.