కొబ్బరి నీళ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తూ, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే దివ్యౌషధం. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. అమృతంలాంటి కొబ్బరినీళ్లను విషతుల్యంగా మార్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
కొబ్బరి నీళ్లను తీసిన వెంటనే తాగాలి. అప్పుడే అందులోని పూర్తిస్థాయి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇక గాలి తగిలిన వెంటనే పోషకాలు కోల్పోవడం మొదలవుతుంది. బొండాంలోని నీళ్లు గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరుపుతాయి. నీళ్లలో ఉండే ఎంజైమ్‌లు.. ఆక్సీకరణ చెంది, రుచితోపాటు రంగు కూడా మారిపోతాయి.
బొండాం నుంచి నీటిని తీసిన తర్వాత.. గది ఉష్ణోగ్రత వద్ద 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఉంచొద్దు. ఎందుకంటే, అవి త్వరగా పులిసిపోతాయి. అదే గాజు సీసాలో పోసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే.. 24 గంటల వరకూ నిల్వ ఉంటాయి. అయితే, రుచిని మాత్రం కోల్పోతాయి.
నీళ్లు కాస్త తెల్లగా మారినా, పుల్లటి వాసన వచ్చినా, రుచిలో తేడా గమనించినా.. వాటిని పక్కన పెట్టేయాలి. ఎక్కువ సమయంపాటు నిల్వ ఉన్న కొబ్బరి నీళ్లను తాగితే.. జీర్ణక్రియ సమస్యలు, వాంతులు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు తాజా కొబ్బరి నీళ్లనే తీసుకోవడం మంచిది.