ఒపెక్ అనేది చమురు ఎగుమతి చేసే దేశాల సమాఖ్య మాత్రమే కాదు; అది ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేసే కీలక వ్యవస్థ. 1960లో స్థాపించిన ఈ సమాఖ్యలో కాలక్రమేణా సభ్యత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యూఏఈ, అల్జీరియా, లిబియా, నైజీరియా, కాంగో, గబన్, ఈక్వెటోరియల్ గినియా, వెనెజువెలా – మొత్తం 12 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 1967లో చేరిన యూఏఈ ఆరు దశాబ్దాలపాటు క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత నిష్క్రమణ దిశగా
సాగటం, అంతర్జాతీయ చమురు వ్యవస్థలో ఒక నిర్మాణాత్మక మార్పునకు సంకేతం.
ఈ సమాఖ్య నేరుగా ధరలను నిర్ణయించదు – కానీ, వాటిని పరోక్షంగా ప్ర భావితం చేస్తుంది. సరఫరా తగ్గితే, డిమాండ్ పెరిగి తదనుగుణంగా ధరలు పెరుగుతాయన్న ది ఆర్థికసూత్రం. దీనిని ఆధారంగా చేసుకున్న ఒపెక్, ఎప్పటికప్పుడు సభ్యదేశాల చమురు ఉత్పత్తిని కోటాల ద్వారా కట్టడి చేస్తూ, ధరలను తనకు అనుకూలంగా ఉండేటట్లు ప్రభావితం చేస్తున్నది. అయితే, దాదాపుగా చమురు అమ్మకాల పైనే ఆధారపడిన ఒపెక్ దేశాలు, తమ ఆదాయం పెంపు కోసం తరచూ కోటాలను ఉల్లంఘిస్తున్నాయి. ఈ కారణంగా, ప్రస్తుతం ఒపెక్ ఒక కఠిన కార్టెల్ కంటే, అంతర్జాతీయ రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేయగల వేదికగా రూపుదిద్దుకుంటున్నది. అయినప్పటికీ, చమురు ధరలపై ఇంకా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతూనే ఉన్నది.
తన చమురు నిల్వలు, ఉత్పత్తి-ఎగుమతుల సామర్థ్యం, ఆర్థికపటుత్వం వల్ల సౌదీ అరేబియా ఒపెక్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఆ దేశం ఉత్పత్తి నియంత్రణకు, చమురు ధరల స్థిరీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నది. అదే సమయంలో యూఏఈ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని తహతహలాడుతున్నది. తద్వారా అంతర్జాతీయ చమురు మార్కెట్లలో తన వాటాను పెంచుకొని, ఆర్థిక ఫలితాలను సత్వరమే అందుకోవాలని ఆకాంక్ష. ప్రస్తుతం ఉన్న రోజువారీగా సుమారు 34 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని 50 లక్షల బ్యారెళ్లకు పెంచుకోవాలని యూఏఈ సంకల్పం. ఇందులో ఒకరిది దూరదృష్టి అయితే, మరొకరిది తక్షణావసరం.
భారత్ వంటి చమురు దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఈ పరిణామం నిర్ణయాత్మకమైన ప్రభావం చూపుతుంది. యూఏఈ కోటా పరిమితుల నుంచి బయటకు రావటం వల్ల దాని చమురు సరఫరా పెరిగితే, అది ధరలపై రెండు రకాలుగా సానుకూల ప్రభావం చూపుతుంది. ఒకవైపు, మొత్తం చమురు ఉత్పత్తి పెరగటం వల్ల, సహజంగానే ధరలు తగ్గుతాయి. మరోవైపు, యూఏఈ వంటి ప్రధాన ఎగుమతిదారు ఉత్పత్తి నియంత్రణ నుంచి వెలువడడం వల్ల ఒపెక్ సమన్వయ సామర్థ్యం బలహీన పడుతుంది – దీంతో ధరలపై ఒపెక్ ప్రభావం తగ్గి, అవి మార్కెట్ స్థితిగతులను బట్టి ప్రయాణించే అవకాశం ఉన్నది.
అయితే మొత్తం ఒపెక్ ఉత్పత్తిలో యూఏఈ వాటా సుమారు 810 శాతం మాత్రమే ఉండటంతో, చమురు ధరలపై ఈ ప్రభావం పరిమితంగానే ఉంటుంది. భారత్ తన ముడిచమురు అవసరాల్లో సుమారు 8587 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. ఇటీవలి కాలంలో చమురు దిగుమతి వ్యయం సాలీనా సుమారు $120150 బిలియన్ల పరిధిలో ఉంటుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలో ప్రతి $10 మార్పు, భారత దిగుమతి వ్యయాన్ని సుమారు $1215 బిలియన్ల వరకు ప్రభావితం చేస్తుంది. ఈ మార్పు కేవలం దిగుమతి బిల్లుకే పరిమితం కాకుండా, మారకద్రవ్య లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ వంటి ముఖ్య ఆర్థిక సూచీలపై ప్రభావం చూపుతుంది.
యూఏఈతో ఉన్న భౌగోళిక సామీప్యత ఈ ప్రయోజనాన్ని మరింత సులభతరం చేస్తుంది. భారత్‌కు దిగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో సుమారు 710 శాతం యూఏఈ నుంచే వస్తున్నది. ఆ దేశం ఉత్పత్తి పెరిగితే, భారత దిగుమతుల్లో ఆ దేశ వాటా కూడా పెరిగే అవకాశం ఉన్నది. భౌగోళిక సామీప్యత కారణంగా, రవాణా-బీమా వ్యయాలు ఆదా అవుతాయి. యూఏఈ అధిక పరిమాణంలో చమురు సరఫరా చేయగలిగితే, భారత్‌కు ఆ దేశంతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవటం సులభమవుతుంది. ఇది సరఫరా స్థిరత్వం సాధించటమే కాకుండా, ఇతర సరఫరాదారులతో ధరల విషయమై జరిగే చర్చల్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. అదనంగా, రూపాయి ఆధారిత చెల్లింపుల వినియోగం విస్తరించే అవకాశం ఉన్నది.
భారత్ వ్యూహాత్మక చమురు నిల్వల విస్తరణలో యూఏఈ భాగస్వామ్యాన్ని కూడా తోసిపుచ్చలేం. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇలాంటి పెట్టుబడులు భారత్‌కు అదనపు నిల్వ సామర్థ్యాన్ని నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి; వ్యూహాత్మక నిల్వలను బలోపేతం చేస్తాయి. యూఏఈతో భాగస్వామ్యం సరఫరా భద్రతాపరంగా కూడా కీలకంగా మారుతుంది. హబ్షన్ఫుజైరా పైప్‌లైన్ ద్వారా హొర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ఎగుమతులు కొనసాగించే సామర్థ్యం యూఏఈ కలిగి ఉంది. దీంతో, గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతల సమయంలో కూడా సరఫరాకు అంతరాయం ఏర్పడటానికి అవకాశాలు తక్కువ. ఫుజైరా వంటి ప్రపంచస్థాయి నిల్వ కేంద్రాల ద్వారా, అప్పటికే నిల్వలో ఉన్న చమురును తక్షణ మార్కెట్లో కొనుగోలు చేసే అవకాశం భారత్‌కు లభిస్తుంది.
చమురు సరఫరా-నిల్వల విషయంలో భద్రత ఏర్పడితే, భారత్ తన శుద్ధి చేసే సామర్థ్యాన్ని గరిష్ఠస్థాయిలో వినియోగించుకోగలదు. తద్వారా, శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న పన్ను ప్రతిబంధకాలను తొలగించటంతో, విదేశీ మారకద్రవ్యం చేకూరుతుంది. పెరిగిన చమురు ఉత్పత్తి కారణంగా యూఏఈ ఆర్థికవ్యవస్థ వ్యాకోచించితే – అది ప్రవాస భారతీయుల ఉద్యోగావకాశాలు, వారి ద్వారా భారత్‌కు చేరే నిధులు వంటి వాటిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే, ఈ లాభాలతో పాటు కొన్ని అంతర్లీన సవాళ్లు కూడా ఉన్నాయి. ఒపెక్ సమన్వయం బలహీనపడితే, ప్రపంచ చమురు ధరల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉన్నది.
ఉదాహరణకు, 2020లో సౌదీరష్యా ధరల యుద్ధం, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు సుమారు $60 స్థాయి నుంచి $20కి పడిపోయి, కొద్ది నెలల్లోనే మళ్లీ $4050 పరిధికి ఎగసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి హెచ్చుతగ్గులు మన దేశ ఆర్థిక ప్రణాళికలను క్లిష్టతరం చేస్తాయి. ధరల దిశ మాత్రమే కాకుండా, మార్పుల తీవ్రతను అంచనా వేయటం కూడా కష్టమవటం వల్ల దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు, ధర రక్షణ వ్యూహాలు, విదేశీ మారక నిర్వహణ అన్నీ సవాళ్లుగా మారుతాయి.
దేశీయ చమురు ఉత్పత్తిదారులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ధరల్లో దీర్ఘకాలం స్తబ్ధత ఉంటే, చమురు వెలికితీత సంస్థల ఆదాయాలు తగ్గే అవకాశం ఉన్నది; కొత్త అన్వేషణలు, పెట్టుబడులు మందగిస్తాయి. దీర్ఘకాల దృష్టిలో చూస్తే, ఈ పరిణామం ప్రపంచ చమురు మార్కెట్‌ను కార్టెల్ ఆధారిత నియంత్రణ నుంచి పోటీ ఆధారిత వ్యవస్థ వైపు నడిపించే అవకాశం ఉన్నది. ఇది భారత్ వంటి దేశాలకు స్థూలంగా సానుకూల పరిణామమే. భారత్ ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలంటే – తక్కువ ధరల సమయంలో వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవటం, యూఏఈతో దీర్ఘకాలిక ఒప్పందాలను చేసుకోవటం వంటి చర్యలు కీలకం. మొత్తంగా చూస్తే, యూఏఈ ఒపెక్ నిష్క్రమణ భారత్‌కు ఒక అరుదైన వ్యూహాత్మక అవకాశం. ఇది కేవలం తాత్కాలిక ధరల ఉపశమనం కాదు; సరైన విధానాలతో ముందుకు సాగితే, ఇది దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. భారత్ ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం కలిగి ఉన్నది.
– కృష్ణ బాలాజీ పల్లపోతు 99490 98406