బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎసరు తెస్తున్నది. షరతుల పేరిట గుట్టుచప్పుడు కాకుండా ఉసురు తీస్తున్నది. పథకం ప్రారంభించింది ఎవరైనా దాని వెనుకనున్న ఉద్దేశాలను గుర్తించి, సాధకబాధకాలను తొలగించి మెరుగైన రీతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. పాత బకాయిలను కూడా విడుదల చేసి తన పెద్ద మనసు చాటుకున్నది.
కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని మొత్తంగా అటకెక్కించేందుకు పావులు కదుపుతున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకం పట్ల అనుసరిస్తున్న వైఖరి సర్కార్ ప్రాధాన్యతలను చెప్పకనే చెప్తున్నది. అందుకు తాజాగా తెచ్చిన ‘జీవో 7’ ఒక నిదర్శనం. 30 నెలలుగా పైసా ఇవ్వకుండా పథకానికి ప్రభుత్వం ఉరి బిగిస్తూ వచ్చింది. రకరకాల సాకులతో ఫీజుల చెల్లింపును దాటవేస్తున్నది. కొంతకాలం టోకెన్లు, కమిటీలంటూ కాలయాపన చేసింది. మరికొంతకాలం వన్‌టైమ్ సెటిల్మెంట్ అంటూ నాటకాలాడింది. ఇప్పుడేమో నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు సొమ్ము జమ చేస్తామని కొత్త పాట ఎత్తుకున్నది.
ఫీజు బకాయిలు రూ.10 వేల కోట్లు దాటాయి. 30 నెలల్లో మూడు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు తెచ్చిన సర్కార్ ఫీజుల బకాయిల్లో పైసా చెల్లించకుండా ఉండటం విడ్డూరం. అన్ని సాకులు అయిపోయాక నేరుగా ఖాతాల్లోకే సొమ్ము అంటూ నమ్మబలుకుతున్నది. మాట తప్పటంలో, మడమ తిప్పటంలో మేటి అనిపించుకున్న కాంగ్రెస్ మాటల్ని ఇంకా విశ్వసించే స్థితిలో ఎవరూ లేరు. ‘అయ్యవారు వచ్చేంత వరకు అమావాస్యం ఆగదన్నట్టు’గా ప్రభుత్వ సొమ్ము పడే వరకు కాలేజీల్లో అడ్మిషన్లు ఆగవు. అడ్మిషన్లు కావాలంటే పిల్లల తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి ఫీజు కట్టాల్సిందే. ఆపై సర్కార్ ఎగనామం పెడితే ఎవరూ ఏమీ చేయలేరు. ఇన్నాళ్ల ప్రభుత్వ తీరు గమనిస్తే చివరికిదే జరుగడం ఖాయం అని చెప్పకతప్పదు. ఎగ్గొట్టిన సవాలక్ష హామీల సరసన ఇది కూడా చేరిపోతుంది. కాలక్రమంలో చీకటి జీవో కారణంగా రీయింబర్స్మెంట్ పథకం గుట్టుచప్పుడు కాకుండా కొండెక్కుతున్నది. కాలేజీలకు ఫీజు సొమ్మును చెల్లించే బాధ్యత నుంచి సర్కార్ పూర్తిగా తప్పుకునేందుకు వేసిన ఎత్తుగడగా మాత్రమే దీనిని చూడాల్సి ఉంటుంది.
ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవితవ్యం డోలాయమానంలో పడుతుంది. ఎన్నికలకు ముందు ఎన్నెన్నో ఇస్తామని ఊరించి, అధికారంలోకి వచ్చాక ఉన్నవి ఊడగొడుతున్నది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి క్రమంగా తిలోదకాలిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బడుగుల బిడ్డల చదువులకు ఎగనామం పెడుతున్నది. సాంకేతిక విద్యాకోర్సులకు వారు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నది. దశాబ్దంన్నర క్రితం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయని విద్యావేత్తలు హెచ్చరిస్తుండటం గమనార్హం.
ఉపాధికి తొలిమెట్టు లాంటి ఉన్నత సాంకేతిక విద్యకు వెనుకబడిన వర్గాల పిల్లలను దూరం చేయటం అభిలషణీయం కాదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అధునాతన సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడే కుట్రలు పన్నటం ఏమాత్రం క్షంతవ్యం కాదు. బడుగులపై పెదవి తీపి మాటలు కట్టిపెట్టి ఫీజులకు ఉరిపెట్టే మాయదారి జీవోను వెనుకకు తీసుకుని, ఫీజు బకాయిల చెల్లింపునకు తక్షణం చర్యలు చేపట్టడం తక్షణావసరం. లేకపోతే విద్యార్థిలోకం ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని సర్కార్ గుర్తుంచుకోవాలి.