ప్రస్తుత స్మార్ట్‌యుగంలో పిల్లల పెంపకం చాలా కష్టంగా మారిపోయింది. కరోనా టైమ్‌లో ఆన్లైన్ క్లాసుల పేరుతో చాలామంది ఫోన్లకు అలవాటుపడ్డారు. కరోనా జాడలేకుండా పోయినా.. దాని ప్రభావం మాత్రం ఫోన్ల రూపంలో పిల్లలను వేధిస్తూనే ఉంది. ఆటవిడుపు కోసం ఆరుబయటికి వెళ్లకుండా పడగ్గదిలో ఫోన్లో తలదూరుస్తున్నారు. దీంతో ఆటపాటలు లేక ఆరోగ్యం దెబ్బతింటున్నది. మానసిక సమస్యలూ తలెత్తుతున్నాయి.
ఫోన్లకు తెగ అలవాటుపడిన పిల్లలు నలుగురిలో అంతగా కలవలేరు. పదిమందిలో మాట్లాడాలన్నా భయపడుతుంటారు. దీనివల్ల ఆనందోత్సాహాల మధ్య హాయిగా సాగిపోవాల్సిన బాల్యం భారంగా మారుతుంది. మీ పిల్లల్లో ఇలాంటి వైఖరి గమనిస్తే.. పేరెంట్స్‌గా తక్షణం దిద్దుబాటు చర్యలకు పూనుకోండి. ప్రతిరోజూ ఓ అరగంట అయినా వారితో కబుర్లు చెబుతూ ఉండండి. బడిలో ఏం జరిగిందో మీతో చెప్పమనండి. కొన్నాళ్లకు వారికి భాషా నైపుణ్యాలు పెరగడంతోపాటు భావ వ్యక్తీకరణ సామర్థ్యాలూ మెరుగవుతాయి.
ఫోన్ చూడకుండా కఠిన నిబంధనలు పెడితే.. పిల్లలు చిన్నబుచ్చుకుంటే ఫర్వాలేదు. కానీ, అతిగా స్పందిస్తేనే ప్రమాదం. అలా కాకుండా ఉండాలంటే.. ఫోన్ చూసే వేళలు ఫిక్స్ చేయండి. ఏం చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూనే.. చూసే స్వేచ్ఛ వారికి ఇవ్వండి. నిదానంగా స్క్రీన్ టైమ్ తగ్గిస్తూ… ఫోన్ అలవాటును దూరం చేయండి.
కొత్త ఆటవస్తువు తెచ్చినప్పుడు పిల్లలు పాతదాన్ని పక్కన పెడుతుంటారు. స్మార్ట్‌ఫోన్‌లో ఆటలు, వీడియోల కన్నా మంచి కాలక్షేపం మీరు చూపించగలిగితే.. పిల్లలు ఫోన్ జోలికి రాకుండా ఉంటారు. ఉదయం గానీ, సాయంత్రం గానీ వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించండి. శిక్షణ ఇప్పించినంత మాత్రాన వాళ్లు జాతీయస్థాయి ఆటగాళ్లు కావాలన్న నియమం పెట్టుకోవద్దు. శారీరకంగా, మానసికంగా బలం పుంజుకోవడానికి ఆటలను మించిన మార్గం లేదు. వారాంతాల్లో ఇంటికే పరిమితం కాకుండా షికారుకు వెళ్లే ప్రయత్నం చేయండి.