బంగారం, వెండి, ప్లాటినం.. రకరకాల లోహాలతో ఆభరణాలు చేయించుకుంటాం. కానీ, బుల్లెట్‌తో చేసిన నగల గురించి విన్నారా? ట్రిగ్గర్ నొక్కగానే.. రివ్వున దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది బుల్లెట్. కానీ, గురితప్పిన వందలకొద్దీ బుల్లెట్ల మాటేమిటి? వాటిని అందమైన బ్రేస్లెట్స్గా, నెక్లెస్లుగా మలిచి.. ఫ్యాషన్ పరిశ్రమకు తరలిస్తున్నారు కాంబోడియాలోని స్వర్ణకారులు. అందులోనూ చాంతా తోయుమ్ ఆ విద్యలో ఆరితేరిపోయాడు.
అతని అందమైన అభిరుచి వెనుక ఓ తీవ్ర విషాదం ఉంది. చాంతా ఏడేండ్ల పసివాడిగా ఉన్నప్పుడు ఆ దేశంలో అంతర్యుద్ధం తలెత్తింది. ఉగ్రమూకల దాడిలో తండ్రిని కోల్పోయాడు. ఆయన శవం చుట్టూ పడున్న బుల్లెట్లను చూసి ఆట వస్తువులని భావించాడు. జాగ్రత్తగా దాచుకున్నాడు. స్వతహాగా స్వర్ణకారుల కుటుంబం కాబట్టి, ఆ లోహాన్ని కరిగించి ఆభరణాలు చేశాడు. మిగిలిన స్వర్ణకారులూ ఆ బాటలోనే నడిచారు. బుల్లెట్ జువెలరీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.