అమ్మపాలు అమృతం కన్నా గొప్పవి. పసిపాపలకు అమ్మ ప్రేమగా పట్టే పాలు.. వారి ఆకలి తీర్చడమే కాదు, ఆయువునూ పోస్తాయి. అయితే, రకరకాల కారణాల వల్ల చాలామంది శిశువులు తల్లిపాలకు దూరమవుతుంటారు. వారిని కాపాడేందుకు ఎందరో తల్లులు పాలు దానం చేసి… మాతృత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. అమ్మపాలు పంచే అరుదైన సేవలో నేను సైతం అంటూ ముందుకొచ్చారు ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. తల్లిపాలు దానం చేసి ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ‘శిశువులను అనారోగ్యాల బారిన పడకుండా తల్లిపాలు కాపాడుతాయి. పాలను దానం చేసి ఓ బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చినవాళ్లమవుతాం.
అందుకే పాలను దానం చేసేందుకు ప్రతీ తల్లి ముందుకు రావాలి. ఈ పాలు అవసరమున్న చోట మనం వాళ్లకు దేవతలాగా కనిపిస్తాం. మిల్క్ బ్యాంక్‌లకు మద్దతివ్వండి’ అంటూ రాసుకొచ్చింది జ్వాల. 2021లో నటుడు విష్ణు విశాల్‌ను పెండ్లి చేసుకున్న జ్వాల నాలుగేండ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటివరకు దాదాపు 30 లీటర్ల తల్లిపాలను ఆమె దానం చేశారు. గుత్త జ్వాల చూపుతున్న చొరవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.