బుర్రలో చిప్ పెట్టుకుని తిరిగే ఇస్మార్ట్ శంకర్లను ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో చూశాం. ఇకపై మన చుట్టూనే ఉండొచ్చు! ఎందుకంటే.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు (బీసీఐ) వచ్చేస్తున్నాయ్. ఓ చిన్న చిప్‌ని మెదడులో పెట్టేస్తారు. ఇక అన్నీ అదే చూసుకుంటుంది. సమాచారాన్ని అదే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. కనీసం కదిలే అవసరం కూడా లేదు. మెదడులో ఆలోచన రాగానే బుర్రలోని చిప్ దాన్ని గ్రహించి.. కమాండ్లా తీసుకుంటుంది.
ప్రాసెస్ చేసి కమాండ్ రూపంలో కనెక్ట్ చేసి డివైజ్‌లకు పంపేస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన సింకోన్ అనే సంస్థ అలాంటి చిప్‌ని తయారుచేసింది. కదల్లేని స్థితిలో ఉన్న ఓ 64 ఏళ్ల వయసు పెద్దాయన బుర్రలో దీనిని పెట్టింది. చిప్‌ని అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’కి అనుసంధానం చేశారు. దీంతో ఆ పెద్దాయన కంప్యూటర్ ముందు కూర్చుని తన ఆలోచనలతోనే సిస్టమ్‌ను యాక్సెస్ చేయగలిగాడు.
తనకు కావాల్సిన వాటిని అమెజాన్‌లో షాపింగ్ చేయగలిగాడు కూడా. అంతేకాదు.. ట్రయల్ రన్లో భాగంగా బీసీఐ టెక్నాలజీని ఐఫోన్, ఐప్యాడ్ పైనా ప్రయత్నించారు. దీంతో పక్షవాతానికి గురైన రోగులు ఈ గ్యాడ్జెట్స్‌ను తాకకుండా కేవలం ఆలోచనలతోనే వాటిని ఉపయోగించగలిగారు.
బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ను ఇలా వాయిస్ అసిస్టెంట్లకు అనుసంధానించి వాడటం ఇదే తొలిసారి అని రూపకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయట. దీంతో శరీరంలో చలనం కోల్పోయిన ఎంతోమందికి ఈ బీసీఐ తోడుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.