కాళిదాసు కవనం కుతూహలంగా పల్లవించిన నేల అది. భోజరాజు పాలనలో కళలకు కాణాచిగా నిలిచిన నగరమది. సరస్సుల నగరంగా యశస్సు మూటగట్టుకున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్.. మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. జిహ్వ చాపల్యం ఉన్నవారికి భోపాల్ సాదరంగా స్వాగతం పలుకుతుంది. పోహాతో ఆహా అనిపిస్తుంది. జిలేబీతో గులాము చేసుకుంటుంది. పాయాతో ప్యార్ను పంచుతుంది. ఈ చారిత్రక నగరికేగి రుచుల తాళం వేద్దాం పదండి..

అన్ని ప్రముఖ రైల్వేస్టేషన్ల మాదిరి భోపాల్ స్టేషన్ కూడా జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ, ఇక్కడి ప్రయాణికులు దిక్కులు చూడరు. వాదులాటకు దిగరు. చాలా బిజీగా ఉంటారు. తదేకంగా తినే పనిలో నిమగ్నమవుతారు. ఇంతలో ‘హైదరాబాద్ సే నయీ దిల్లీ జానేవాలే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దో నంబర్ ప్లాట్‌ఫామ్ పే ఆనేవాలే హై’ అని అనౌన్స్మెంట్. స్టేషన్లో ఉన్న జనాల్లో నో కదలిక. ట్రైన్లో ఉన్నవాళ్లలో మాత్రం హడావుడి మొదలవుతుంది. అందరూ ఇరవై, యాభై రూపాయల నోటు చేత బుచ్చుకొని.. ఏదో దండయాత్రకు సిద్ధమైనట్టు ప్రిపేర్ అవుతుంటారు.

రైలు స్టేషన్లో ఆగడంతోనే పొలోమని ప్లాట్‌ఫామ్‌పైకి లంఘిస్తారు. అటుకులు చటుక్కున దొరకబుచ్చుకునే కిటుకు కనిపెట్టిన వారికి మల్లే ఉంటుంది వాళ్ల యవ్వారం. ఉల్లిపాయలు, పల్లీలు పోపులో వేగనిచ్చి.. పసుపు చల్లి.. చింతపండు పులుసు చిలకరించి.. ఆపై నీళ్లలో అర నిమిషం నానబెట్టిన దొడ్డు అటుకులు వేసి.. పైనుంచి మసాలా పొడులు దట్టించి.. మొత్తాన్నీ కలియగలిపి.. చివరిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీరతో అలంకరించిన పోహా ప్లేటు అందుకున్న క్షణం.. అన్నమయ్య సినిమా ైక్లెమాక్స్ డైలాగ్ ‘ఇది కాక సౌభాగ్యం ఇదిగాక తపం మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా!’ గుర్తుతెచ్చుకుంటాం.

భోపాల్‌లో రుచుల వైభవం ఇప్పుడే మొదలైందని అప్పుడు గుర్తించం. అలా నగరంలోకి వెళ్లి చూస్తే… ఎక్కడ చూసినా ముద్దపోపు అటుకులు ‘ఓ ముద్ద తిను..’ అని ముద్దు ముద్దుగా పలకరిస్తుంటాయి. ఒక్కోచోట ఒక్కోరుచి. భోపాల్ జామా మసీదు సమీపంలో కల్యాణ్‌సింగ్ స్వాద్ భండార్‌లో మరింత ప్రత్యేకం. ఇక్కడ పోహాతో జిలేబీ కాంబినేషన్ అదిరిపోతుంది. బెల్లం పాకంలో తేలియాడిన జిలేబీలు నోట కరుస్తూ… ఆ తీపి నాల్కపై నర్తిస్తుండగానే పచ్చిమిర్చి ఘాటు పట్టుకున్న అటుకులు బుక్కితే.. దేవదాసు కూడా కాళిదాసై అక్కడి పాకయాజులపై కావ్య రచనకు పూనుకుంటాడు.

స్వీటు ప్లస్ హాటు లాగించేశాక.. నాలుక మడత పేచీ పెడుతుంది. భారతీయుల జాతీయ పానీయమైన టీ చుక్క పడితేగానీ జంట టిఫినీల కిక్కు తలకెక్కదు. అందుకోసం ఓల్డ్ భోపాల్ ఇత్వార్ చౌక్ దాకా వెళ్లాలి. అక్కడ జమాల్ భాయ్ టీ కొట్టు ఇట్టే దొరికిపోతుంది. ఎవరినీ అడగాల్సిన పనిలేదు. ఓ చిక్కటి పరిమళం పట్టి లాగుతుంది. ఆ దిశగా వెళ్తుంటే.. గుంపులు గుంపులుగా ఏకాక్షరి (టీ) సాధకులు కంటపడతారు. అక్కడికి చేరిన మరుక్షణం టీ కప్పు చేతికి అందుతుంది. నురగల కుచ్చుటోపీ పెట్టుకున్న చాయ్ గిలాస అందుకోగానే బాధలన్నీ ఖల్లాస్. రుచి చూశాక సంతోషాల వేడుక ఖాయం. ఢిల్లీలో రుచులకు చాంద్నీ చౌక్ గల్లీ ఎలా ఫేమసో.. భోపాల్‌లో జిహ్వ చపలురకు చటోరీ గల్లీ అంత ఫేమస్. సమోసాలు, కచోరీలు, మిర్చీలు అన్ని చిరుతిళ్లనూ ‘గప్‌చుప్’గా లాగించేయొచ్చు. శర్మ చాట్ షాప్‌లో దహీ ఫుల్కీ భోపాలీ స్పెషల్. దహీ కిచిడీ, సాబుదానా వడ మరింత ఆకట్టుకుంటాయి. ఇప్పుడు షార్ట్ బ్రేవ్.. సారీ బ్రేక్!

మలిసంజె వేళకు మళ్లీ రుచుల యాత్ర షురూ! షాహీ తుకుడాతో ఆరగింపు సేవ ఆరంభించండి. ఓల్డ్ భోపాల్‌లో జమీల్ అడ్డాలో కబాబ్స్ టేస్ట్ చేయండి. మనోహర్ డెయిరీలో పూరీలు షేప్ అవుటుగా కనిపించినా రుచిలో మాత్రం మేటి! భోపాల్ పర్యటనలో తప్పక రుచి చూడాల్సిన పదార్థం దాల్ బాఫ్లా. నానారకాల పప్పులను పిండిగా మార్చి, నీళ్లతో తడిపి, ముద్దగా చేసి, బోలుగా తీర్చిదిద్ది.. నీళ్లలో ఉడికించి.. నిప్పులపై కాల్చి.. చిన్నముక్కలుగా విరిచి.. సలసల కాగే నేతిలో వేయించి… ఉల్లిగడ్డ ముక్కలు, ఒకటి రెండు రోటి పచ్చళ్లు, పప్పు కట్టు, వంకాయ కూర వడ్డించిన కిస్తీలో వేసి చేతికిస్తారు. వేడివేడిగా చవులూరించే దాల్ బాఫ్లా తిన్న తర్వాత.. భూపాల రాగంలో భోపాల రుచుల వైభవాన్ని కీర్తించకుండా ఉండలేరు భోజన ప్రియులు. భోపాల్ మీదుగా ఏ ప్రాంతానికేగినా అక్కడో రోజు ఉండాలని కచ్చితంగా తీర్మానించుకుంటారు.
– రామకీర్తన