‘పిల్లలు అల్లరి చేస్తేనే అందం.. ఈ వయసులో కాకపోతే అల్లరి ఎప్పుడు చేస్తారు. చిన్నప్పుడు అల్లరి చేస్తే పెద్దయ్యాక వాళ్లంతట వాళ్లే సైలెంట్ అయిపోతారు..’ అల్లరి పిడుగులు ఉన్న ఇంట ఇవీ పెద్దల మాటలు. అల్లరి హద్దుల్లో ఉంటేనే ముద్దు. కానీ, కొందరు చిన్నారులు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేస్తారు. ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. కట్టలు తెంచుకున్న కోపంలో పిల్లలను గట్టిగా తిడితే ఆ చిట్టి గుండెలు తీవ్రంగా బాధపడతాయని గుర్తుంచుకోవాలి.
బయటికి వెళ్లినప్పుడు కంటికి ఆకర్షణీయంగా కనిపించినవి, నచ్చినవీ కొనాలని పిల్లలు మారాం చేస్తూ ఉంటారు. అయితే, పలు కారణాలతో తల్లిదండ్రులు వాటిని కొనడానికి మొగ్గుచూపరు. ధర ఎక్కువ, మన దగ్గర అంత డబ్బు లేదు అనే మాటలు చెబుతారు. ఆ మాటల వల్ల పిల్లల్లో ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. అలా కాకుండా పిల్లలకు.. తర్వాత కొనుక్కుందాం.. ఇప్పుడు కాదు.. అనవసరమైన ఖర్చులు చేయకూడదు.. పొదుపు అనేది చాలా ముఖ్యం.. ఇలా నిదానంగా సర్ది చెప్పాలి.
ఈ తరం పిల్లలు చాలా తెలివి మీరుతున్నారు. వారిముందు అనవసరమైన మాటలు అస్సలు అనొద్దు. ‘అనవసరంగా పుట్టావు. నువ్వు పుట్టకున్నా బాగుండేది..’ ఇలా ఆవేశంలో మాటజారితే.. పిల్లల మనసు విరిగిపోతుంది. తర్వాత ఎన్ని క్షమాపణలు చెప్పినా.. మీరన్న మాట వారి మనసు నుంచి చెరిగిపోదు. ఎంత విసుగులో ఉన్నా.. దానికి కారణాన్ని పిల్లల మీద రుద్దవద్దు.
పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. తల్లిదండ్రులు అనుకున్న విషయాల్లో పిల్లలు విజయాన్ని సాధించలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో.. వారిని అనునయించాలే కానీ, సూటిపోటి మాటలతో బాధపెట్టొద్దు. ‘నీ వల్ల కాదు..’ అనేలా వ్యవహరిస్తే, వారు ఎందుకూ కొరగాకుండా పోతారు. ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ, వారి ఉత్సాహంపై మాత్రం నీళ్లు చల్లొద్దు.
ఎదురింటి పిల్లలతోనో, బంధువుల బిడ్డలతోనో తమను పోల్చడం పిల్లలకు అస్సలు నచ్చదు. ఇంట్లోవాళ్లతోనూ కంపేర్ చేయొద్దు. ‘అక్క చూడు ఎంత తెలివైందో.. తమ్ముణ్ని చూసి నేర్చుకో..’ ఇలాంటి మాటలు వాళ్లకు ఈటల్లా గుచ్చుకుంటాయి. వారిని చూసి కొత్త విషయాలు నేర్చుకోకపోగా, మీ కారణంగా స్నేహితులు, తోబుట్టువులపై కక్ష పెంచుకునే ప్రమాదమూ ఉంది.