Bathukamma | అడవి పూలు కొన్ని! పల్లెసీమలో విరిసిన కుసుమాలు ఇంకొన్ని! ఏ కోణంగి కొప్పులోనూ ఇవి కనిపించవు. ఏ మనోహరుడి మెడలోనో హారమై పరవశించాలని అస్సలు అనుకోవు! వనదేవత ఒడిలో పూసిన ఈ పూలు పూజించడానికో, పాన్పుపై పరుండటానికో పుట్టినవి కావు!! పూజలు అందుకోవడానికి జన్మనెత్తినవి! జీవంతికా దేవిగా కొలువుదీరి ఆడపడుచుల ఆటపాటల అర్చనల్లో మురిసిపోతాయి. గుమ్మడి పూలతో అరుగేసి.. గోరంట పూలతో గోడలు కట్టి.. గునుగు పూలతో గోపురం పెట్టి.. తంగేడు పూలతో రంగులద్దుకొని ముచ్చటగొలిపే బతుకమ్మ వైభవం మన తెలంగాణకు సొంతం.
ఇష్టదైవాన్ని పూలతో అర్చించడం అంతటా కనిపించేదే! కానీ, పూలనే దేవతగా భావించే పండుగ బతుకమ్మ. ఆ జగజ్జనని అనుగ్రహంతో విరిసిన పూలను శ్రీచక్రాకృతిలో పేర్చి బతుకును అందించిన బతుకమ్మగా భావిస్తారు. అంతగా పరిమళాలు వెదజల్లని పూలకే బతుకమ్మలో పెద్దపీట వేస్తారు. వాసనలు వదులుకోవడమే ఆధ్యాత్మికత అంతిమ లక్ష్యం. ఏ వాసనలూ లేని బతుకమ్మ పూలు ఇదే సత్యాన్ని తెలియజేస్తాయి. అంతేకాదు, ఈ అడవి పూలకు ఓ ప్రత్యేకత ఉంది. వానలు అంతగా కురవకపోయినా శరదృతువు వచ్చేనాటికి తంగేడు పూలు బంగారు కాంతులీనుతూ పుట్టుకొస్తాయి. నేల నెర్రెలు బారినా గునుగు పూలు వెండి వెలుగులు విరజిమ్ముతూ దర్శనమిస్తాయి. గునుగు పూలకు మరో విశేషం కూడా ఉంది! కొమ్మకు పూసిన పూలు… మొక్క ఎండిపోయే దాకా అలాగే వాడిపోకుండా ఉండటం వీటి ప్రత్యేకత!
ఈ పూలను పేర్చడం ఓ అందమైన కళ. పదిమందిలో తమ ఇంటి బతుకమ్మ గొప్పగా ఉండాలని సంకల్పించి ఈ క్రతువుకు సిద్ధపడతారు అతివలు. పెద్ద ముత్తయిదువకు చేదోడు వాదోడుగా ఆడబిడ్డలు, వారు కోరింది కోరినట్టు అందించే పని కోడళ్లది. వీళ్లకు బంట్రోతులుగా పిడుగుల్లాంటి పిల్లలు. ఈ పేర్చే కళను మురిపెంగా చూస్తూ.. చలోక్తులు విసిరే పురుషులు. సాయంత్రం బతుకమ్మ ఆటకు.. ఆ అమ్మను తీర్చిదిద్దే సందర్భం నాంది పలుకుతుందన్నమాట! తళతళ మెరిసిపోయే తాంబాలంలో గుమ్మడి ఆకులు పరిచి జీవంతికా దేవికి సుఖాసనం వేస్తారు.
ఆపై తంగేడు పూలతో అమ్మపాదాలకు బంగారు పట్టీలు చుడతారు. రకరకాల రంగులద్ది గునుగు పూలను దొంతరలుగా పేరుస్తూ చీర చుడతారు. మధ్యలో చేమంతులు వచ్చి సంతసం పంచుకుంటాయి. మా చోటెక్కడా అని బంతులు ఎగిరి గంతులు వేస్తాయి. బీరిపోతున్న బీరపూలను ఏ ముదితో అందుకొని కట్ల పూల వరుసలో దూరుస్తుంది. గుంభనంగా ఉండే గుమ్మడి పూలను అలంకరించడం అందరి తరం కాదు! వాటిని ఎంత అందంగా అమరిస్తే.. బతుకమ్మ అంతగా ముచ్చటగొలుపుతుంది. గుత్తులుగా దూసిన చల్లగుత్తుల్లో గుంపులుగా ఉండే చిరుచీమలు పెట్టే చికాకును బతుకమ్మ సందడిలో గుర్తించం!! సీతజడ పూలతో అమ్మవారి జడ అలంకరించి… చివరిగా కొప్పులో గుమ్మడి పువ్వుంచి అందులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు.
పూలతో కొలువుదీరిన బతుకమ్మను కీర్తించే పాటల్లోనూ పుష్పాల ప్రస్తావన కనిపిస్తుంది. బతుకమ్మను తీర్చిదిద్దే పాట, గౌరమ్మను గంగ చెంతకు చేరవేసేటప్పుడు మరో పూల పాట.. ఇలా పూల దేవత అర్చనలో పూల సరాగాలు వినిపిస్తూనే ఉంటాయి.
తొమ్మిది రోజులు ఉయ్యాలో..
నమ్మికా తోడుత ఉయ్యాలో..
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో..
అరుగులు వేయించి ఉయ్యాలో..
గోరంట పూలతో ఉయ్యాలో..
గోడలు కట్టించి ఉయ్యాలో..
తామర పూలతో ఉయ్యాలో..
ద్వారాలు వేయించి ఉయ్యాలో..
మొగలి పూలతో ఉయ్యాలో..
మొగరాలు వేయించి ఉయ్యాలో..
ఇలా బతుకమ్మను పూలతో పేర్చే విధానాన్ని పాడుకుంటారు.
బతుకమ్మను సాగనంపే సందర్భంలోనూ ఆ తల్లిని కొలువు దీర్చిన పూల సంగతులన్నీ ఒక్కొక్కటిగా చెబుతూ పాడుకుంటారు.
తంగెడు పూవుల్ల చందమామ..
బతుకమ్మ పోతుంది చందమామ..
పోతె పోతివిగాని చందమామ..
మళ్లెప్పుడొస్తావు చందమామ యాడాదికోసారి చందమామ..
నువ్వొచ్చి పోవమ్మ చందమామ బీరాయి పూవుల్ల చందమామ..
బతుకమ్మ పోతుంది చందమామ కాకర పూవుల్ల చందమామ..
బతుకమ్మ పోతుంది చందమామ..
ఈ విధంగా పండుగలో ప్రతి సన్నివేశంలోనూ పూలను తలుచుకుంటూ ఉంటారు మగువలు.
శివుడి ముద్దులగుమ్మగా భావించే ఈ పూలగుత్తుల బొమ్మను తొమ్మిది రోజులు సందడిగా పూజించి పల్లె తెలంగాణం పరవశిస్తుంది. మంత్రోక్త పూజలు రాకున్నా.. పూలతంత్రంతో ఆ తల్లిని మనసారా అర్చిస్తారు. లయబద్ధంగా ఆడుతూ, శ్రుతి తప్పకుండా పాడుతూ.. అందమైన గీతాలతో నాదోపాసన చేస్తారు. ఈ పూల పండుగలో మనమూ భాగమై పరవశిద్దాం.
…? రామకీర్తన