Walking | నడక.. ఆరోగ్యానికి దివ్యౌషధం! అత్యంత ప్రభావశీలమైన వ్యాయామం! అయితే, మామూలుగా నడిచేకన్నా.. వెనక్కి నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాకింగ్ చేసేటప్పుడు.. శక్తి అనేది చీలమండ నుంచి పుడుతుంది. అదే.. వెనక్కి నడిచే సమయంలో తుంటి, మోకాళ్ల నుంచి శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు శరీరంలో అనేక ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు.
వెనక్కి నడవడం వల్ల నడకలో సమతుల్యత, వేగం మెరుగుపడుతుంది. రివర్స్ వాకింగ్.. కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుందట. అంటే, వ్యాయామం చేసేటప్పుడు గుండె, ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను మరింత ఎక్కువగా గ్రహించడానికి తోడ్పాటు అందిస్తుంది. రివర్స్‌లో నడవడం వల్ల మోకీలు, మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక రోజూ వ్యాయామం చేసేటప్పుడు 10 – 15 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఎముకలు దృఢంగా తయారవుతాయట. బోలు ఎముకల వ్యాధి బారినుంచి తప్పించుకోవచ్చట.
మామూలు వాకింగ్‌తో పోలిస్తే.. వెనక్కి నడవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో కరుగుతుందట. రివర్స్ వాకింగ్.. మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. అందుకే, పిల్లలకూ ఇలా వెనక్కి నడవడం నేర్పించాలనీ, దానివల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వారి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. అయితే, మొదట్లో వెనక్కి నడవడం కష్టంగానే ఉంటుంది. రోజూ 10 – 15 అడుగులు వెనక్కి నడుస్తూ.. ఆ తర్వాత పెంచుకుంటూపోతే అలవాటు అవుతుంది.