రాత్రిపూట విధులు నిర్వహించే మహిళలపై ఆస్తమా పంజా విసురుతున్నది. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే.. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం 50శాతం ఎక్కువగా ఉన్నదని తాజా అధ్యయనం కనుగొన్నది. జీవగడియారం దెబ్బతినడం వల్ల.. ఉబ్బసంతోపాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నది. ఇంగ్లడ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రిటన్కు చెందిన 2,70,000 కంటే ఎక్కువ మంది శ్రామిక మహిళలకు చెందిన డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా రాత్రి షిఫ్ట్లలో పనిచేసే మహిళలను ఆస్తమా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నదని కనుగొన్నారు.
పగటిపూట మాత్రమే పనిచేసే వారితో పోలిస్తే.. రాత్రిపూట పనిచేసే మహిళలు తీవ్రమైన ఆస్తమాతో బాధపడే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉన్నదని వెల్లడించారు. పురుషులతో పోలిస్తే ఆస్తమా వల్ల మహిళల్లో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటున్నదని చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 5.3 శాతం మందికి ఆస్తమా ఉన్నట్టు గుర్తించారు. 1.9 శాతం మందిలో సమస్య తీవ్రంగా ఉన్నట్టు కనుగొన్నారు. వీరంతా ఇన్హేలర్స్, ఇతర స్టెరాయిడ్స్ వాడుతున్నవారే! రాత్రిపూట పనిచేయడం వల్ల సహజ జీవగడియారం (సిర్కాడియన్ రిథమ్) దెబ్బతినడమే ఇందుకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక హార్మోన్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు. పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల ఆస్తమా నుంచి రక్షణ కలుగుతుందని తేల్చారు. మహిళల్లో సహజంగానే టెస్టోస్టిరాన్ తక్కువ ఉంటుంది. కాబట్టి, ఇది వారికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. అందులోనూ మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో ఆస్తమా వచ్చే అవకాశం దాదాపు రెట్టింపుగా ఉన్నదట.
హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోని మహిళల్లో సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తున్నది. వీరిలో చాలామందికి పని గంటలను మార్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి, వారిలో ఆరోగ్య సమస్యలను తగ్గించే మార్గాలను కనుక్కోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం రాత్రి షిఫ్ట్లలో పనిచేసే మహిళలు..
శ్వాస సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అధ్యయనకారులు చెబుతున్నారు. సమస్య నుంచి బయటపడేందుకు శ్వాసను మెరుగుపరిచే యోగాసనాలను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. ఫలితంగా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.