చాలామంది గార్డెనింగ్‌ను ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఫాలో అవుతున్నారు. ఇటు ఇంటికి కావాల్సిన కూరగాయలనూ పండించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు చీటికిమాటికి మొక్కలకు నీళ్లు పోస్తుంటారు. ఫలితంగా, మొక్కలపై ‘ఫంగస్’ దాడిచేస్తుంది. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడి.. వండుకోవడానికి పనికిరాకుండా పోతాయి. అయితే, ఇంట్లో దొరికే పదార్థాలతోనే.. ఈ ఫంగస్‌ను వదిలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫంగస్‌ను నివారించడంలో ‘యాపిల్ సైడర్ వెనిగర్’ సమర్థంగా పనిచేస్తుంది. ఒక లీటర్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని ఫంగస్ సోకిన ఆకులు, కాండంపై పిచికారీ చేయాలి. వారానికి రెండుమూడు సార్లు ఇలా చేస్తే.. ఫంగస్ కనిపించకుండా పోతుంది.
నోటి ఆరోగ్యానికి ఉపయోగించే.. మౌత్‌వాష్ కూడా ఫంగస్‌ను పారదోలుతుంది. ఒక లీటర్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల మౌత్ వాష్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫంగస్‌కు గురైన మొక్కలపై పిచికారీ చేయాలి. తెల్లటి ఫంగస్‌ను ఇది పూర్తిగా నిర్మూలిస్తుంది. అయితే, మరీ ఎక్కువగా వాడితే మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, తక్కువ పరిమాణంలో వాడటమే మంచిది.
వంటల్లో వాడే బేకింగ్ సోడా కూడా.. మొక్కల నుంచి ఫంగస్‌ను తొలగిస్తుంది. రెండు లీటర్ల నీటిలో అర టీ స్పూన్ లిక్విడ్ సోప్, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ ద్రావణాన్ని రెండుమూడు రోజులపాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్ప్రే బాటిల్లో నింపుకొని.. ఫంగస్ సోకిన భాగానికి పిచికారీ చేయాలి. ఫంగస్ పూర్తిగా తొలగిపోయే దాకా ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి. అయితే, సూర్యకాంతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయొద్దు.