తన కోపమే తన శత్రువు అని పెద్దలమాట. అనవసరమైన ఆవేశం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. చీటికీ మాటికీ చిటపటలాడుతుంటే.. సామాజిక బంధాలపైనా దుష్ప్రభావం పడుతుంది. నియంత్రణ కోల్పోతే.. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. కారణం లేకుండా వచ్చే కోపం.. గుండె సంబంధ సమస్యల్ని పెంచుతుంది. ఇవే కాకుండా.. అనేక ఆరోగ్య సమస్యలకు ‘కోపం’ ముఖ్యకారణం అవుతుంది.
ఎప్పుడూ ఆగ్రహంతో ఊగిపోయేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనవసరంగా కోపానికి వచ్చేవారిలో కరోనరీ హార్ట్ డిసీజ్ (సీహెచ్‌డీ) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. కోపంలో ఉన్నప్పుడు ఒత్తిడి హార్మోన్లయిన అడ్రినలిన్, కార్టిసాల్ వేగంగా విడుదలవుతాయి. దాంతో రక్తపోటు, గుండెకొట్టుకోవడం పెరిగి.. గుండెపోటుకు దారితీస్తుంది.
తరచుగా కోపానికి రావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందరిపైనా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుంటే.. దగ్గరివాళ్లు కూడా దూరమవుతారు. ఫలితంగా ఒంటరిగా మిగిలిపోతారు. ఈ పరిస్థితి నిరాశ, ఆందోళనకు దారితీస్తుంది. కొందరిలో నిద్రలేమి సమస్య కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలంలో ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతినడం లాంటివి జరుగుతాయి.