వ్యాయామం అంటేనే నేటితరం ఆమడదూరంలో ఉంటున్నది. జిమ్‌లో రెండుమూడు పుషప్స్ కూడా చేయలేకపోతున్నది. కానీ, పంజాబ్‌కు చెందిన ఈ 75 ఏళ్ల బామ్మ మాత్రం.. కసరత్తులతో కథాకళీ ఆడుతున్నది. జిమ్‌లో బరువులు ఎత్తుతూ, పుషప్స్ చేస్తూ.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నది. ఈమె వ్యాయామం చేస్తున్న తీరు చూస్తే.. ‘వయసు కేవలం ఒక అంకె మాత్రమే’ అనే మాట.. అక్షరాలా నిజమే అనిపిస్తున్నది.
75 ఏళ్ల వయసులో చాలామంది కృష్ణారామా అనుకుంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. కానీ, పంజాబ్‌కు చెందిన అమృత్ కౌర్.. జిమ్‌లో యువకులతో పోటీ పడుతూ కసరత్తులు చేస్తున్నది. తాజాగా ఈ పెద్దావిడ పుషప్స్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది. ఒక్కరోజులోనే 14 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. అయితే, అందరిలాగే అమృత్ కౌర్ కూడా వయసురీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పితో బాధపడేదట. అయితే, ఆ నొప్పులకు భయపడకుండా.. ఫిట్నెస్ ట్రైనర్ అయిన తన మనవడి ప్రోత్సాహంతో జిమ్‌లో చేరిందట.
70 ఏళ్ల వయసులో వ్యాయామాలు మొదలుపెట్టిందట. కేవలం వాకింగ్‌కే పరిమితం కాకుండా.. యువకులతో పోటీపడుతూ కఠినమైన వర్కవుట్స్ కూడా చేస్తున్నది. భారీ బరువులు ఎత్తడం, కాళ్ల బలాన్ని పెంచే స్క్వాట్స్, వీపు-భుజాల దృఢత్వం కోసం పుల్-డౌన్స్ లాంటి వ్యాయామాలూ అలవోకగా చేసేస్తున్నది. ఈ క్రమంలో తన మోకాళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా, నడకలో స్థిరత్వం పెరిగిందని చెబుతున్నది అమృత్ కౌర్. వ్యాయామం వల్ల ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ఉంటున్నదట. ఈ సందర్భంగా కొత్తగా జిమ్‌లో చేరేవారికీ కొన్ని సలహాలు ఇస్తున్నది.