వృద్ధుల్లో నిద్రలేమి సాధారణ సమస్యగా మారింది. నిద్ర మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా.. తరచుగా వాడితే దుష్ర్పభావాల ప్రమాదం ఉంటుంది. ఇందుకు నిపుణులు సిఫారసు చేస్తున్న ఒక సులభమైన చిట్కా.. క్రమం తప్పని శారీరక శ్రమ. వయసు పెరిగేకొద్దీ.. నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అదనంగా ఆర్థరైటిస్, గుండె సమస్యలు, మందుల వాడకం వంటివి నిద్రకు భంగం కలిగిస్తాయి. దాంతో పెద్దవాళ్లు నిద్రపోవడంలో ఇబ్బంది పడుతుంటారు.
రాత్రిపూట తరచుగా మేల్కొంటూ ఉంటారు. ఫలితంగా జ్ఞాపకశక్తి సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గడం, మానసిక స్థితిలో మార్పులు లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటినుంచి బయటపడాలంటే.. వృద్ధుల్లో నిద్ర సమస్యలను నివారించాలి. అందుకు ‘వ్యాయామం’ చక్కని పరిష్కారం చూపుతుంది.