అక్షయ్ గుప్త ఓ అద్భుత సాంకేతిక నిపుణుడు. అమెజాన్ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించి మరీ తన స్టార్టప్ కలల వైపు అడుగులు వేశాడు. వృద్ధులకు సాయపడేలా ఫుట్బిట్ అనే సదుపాయం తెచ్చాడు. సత్యనాదెళ్ల సైతం అతణ్ని మెచ్చుకున్నాడు. ఓ రోజు అక్షయ్ బస్సులో ప్రయాణిస్తుండగా… పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేశాడు. కత్తితో మెడ మీద పొడిచిపారేశాడు. వైద్యం అందించే సమయం కూడా లేకపోయింది. అక్షయ్ చనిపోయాడు. ఆ హంతకుడు మాత్రం ఏమీ ఎరగనట్టు చక్కగా లేచి బస్సు దిగిపోయాడు. కాసేపటికే అతణ్ని పట్టుకున్నారు. అతను కూడా భారతీయుడే.పేరు దీపక్. తన నుంచి ఆ హత్యకు కారణం విన్నవాళ్ల మతిపోయినంత పనయ్యింది.
వ్యక్తిగత కక్షలో, ఈర్ష్యాద్వేషాలో, వివాహేతర సంబంధాలో ఈ హత్యకు కారణం కానే కాదు. దీపక్కి తన మామ అంటే విపరీతమైన ద్వేషం. అక్షయ్‌కి ఆ పోలికలు ఉండటంతో… ఆ ద్వేషాన్ని తన మీద చూపించాడట!!! ఏకంగా ఉసురే తీశాడు. ద్వేషంలో మనుషులు ఎంతలా విచక్షణ తప్పుతున్నారో చెబుతున్న సంఘటన ఇది. సమాజంలో ఇలాంటి ధోరణులు పెరుగుతున్నాయనే భయానికి సూచన ఇది. పశువు నుంచి వచ్చిన మనిషి, తన విచక్షణ కోల్పోయినప్పుడు అదే పశువులా ప్రవర్తిస్తాడు. అదేం కొత్త కాదు. నైతిక విలువలు, పశ్చాత్తాపం, సిగ్గు, చట్టం అంటే భయం, సాటి మనుషుల పట్ల గౌరవం… ఇవన్నీ కూడా ఓ కట్టులాగా పనిచేస్తాయి. కానీ మనిషి ఆ కట్టు దాటుతున్నాడేమో అన్న సంశయం మొదలైంది. ఇది నిజమేనా!
భర్తను చంపి, ఆ శవాన్ని కార్లోనే ఉంచి రాష్ర్టాలు దాటిన మహిళ! భార్యను ముక్కలు చేసి వాటిని ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన భర్త! ప్రియుడితో కలిసి భర్తను చంపి, శవాన్ని కాంక్రీట్ డ్రమ్ములో పూడ్చిపెట్టి… విహారయాత్రకు వెళ్లిన మహిళ. ఈమధ్య ఇలాంటి కథనాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కోపం వల్ల కలిగే అనర్థాలలో దాడి లేదా హత్య కూడా ఉంటాయని ఎవరైనా అర్థం చేసుకుంటారు. ‘క్రోధాద్భవతి సమ్మోహః… సమ్మోహాత్సృతి విభ్రమః… స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో… బుద్ధినాశాత్ప్రణశ్యతి’ అని భగవద్గీత ఎప్పుడో చెప్పింది. కోపం ఒకో స్థాయినీ దాటుకుంటూ ఎలా వినాశనానికి దారితీస్తుందో చెప్పుకొచ్చింది. ఈ చివర స్థాయిని తరచూ చూడాల్సి రావడటమే ఇప్పటి దురదృష్టం. ‘ఇంటి బయటికి అడుగుపెడితే దారి పొడవునా తాగుబోతులు కనిపిస్తుంటే… సమాజంలో తాగుడు సమస్య పెరిగిందని అర్థమవుతుంది. అలాగే ఎక్కడ విన్నా దారుణమైన హత్యల గురించిన వార్తలు వినిపిస్తుంటే… సమాజంలో హింస పెరిగిందని అర్థం’ అంటారు హరీశ్ శెట్టి అనే సైకియాట్రిస్ట్.
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్‌గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ సదా. పదేళ్లు వచ్చేసరికి మూడు హత్యలు చేశాడు. అది ఓ అరుదైన సంఘటన అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే 2000 సంవత్సరం తర్వాత హత్యలు చేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నెలకు 40 వరకూ హత్యలు జరిగితే… అందులో దాదాపు పదిశాతం హంతకులు పిల్లలే ఉండటం గమనార్హం. గత ఏడాది అక్కడ ఓ టీనేజ్ కుర్రాడు తన ప్రత్యర్థిని 50 సార్లు పొడిచి చంపి, ఆ శరీరం మీద డ్యాన్స్ చేయడం సంచలనం సృష్టించింది. ఈమధ్యనే ఓ ముగ్గురు కుర్రాళ్లు… అడ్రస్ చెప్పమని అడిగిన పాపానికి ఓ ప్రయాణికుడిని చంపేసి సమాజాన్ని ఆలోచనలో పడేశారు.
ఈ నేరాలకు పేదరికం, ఇతర పిల్లల ప్రభావం లాంటి కారణాలు ఎలాగూ ఉంటాయి. వాటికి తోడు తల్లిదండ్రులు కెరీర్ పరుగులో పడి పిల్లల తీరును గమనించకపోవడం, వారు అడిగిందల్లా కొనిపెడుతూ ఏదైనా చెల్లుతుందనే భ్రమలో ఉంచడం సరికొత్త కారణాలుగా కనిపిస్తున్నాయి. ‘పిల్లలు 7-9 ఏళ్ల వయసులోనే వాళ్ల అశాంతిని తీవ్రంగా కనబరుస్తారు. పళ్లు కొరకడం, దాడి చేయడం, మూగజీవాలను హింసించి ఆనందించడం, వస్తువుల్ని నాశనం చేయడం లాంటి పనులు చేస్తారు. ఈ దశలోనే కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇదంతా సహజమే అనుకుంటే మాత్రం ప్రమాదం తప్పదు’ అంటారు జితేంద్ర నాగ్‌పాల్ అనే సైకియాట్రిస్ట్. అంతేకాదు పిల్లలు అడిగిందల్లా కొనిపెట్టడం వల్ల వాళ్లలో ఓర్పు, సర్దుబాటు లాంటి లక్షణాలు కొరవడుతున్నాయి అని ఆయన గుర్తుచేస్తున్నారు.
టీనేజర్లు సోషల్ మీడియాలో నేరాలను చూసి ప్రభావితం కావడం ఒక ఎత్తయితే… నేరం చేసిన తోటి టీనేజర్లు అదేదో ఘనకార్యం అన్నట్టు సోషల్ మీడియాలో చాటుకోవడం మరింతగా రెచ్చగొడుతున్నది. ‘పిల్లలు తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారు. కానీ వాళ్లే కళ్లకు కనిపించకపోతే సోషల్ మీడియానే ఆదర్శంగా మారుతుంది’ అని హెచ్చరిస్తున్నారు జితేంద్ర. చిన్నవయసులో ఏం చేసినా తప్పించుకోవచ్చు అనే అపోహ కూడా పెరుగుతున్న బాలనేరస్తుల సంఖ్యకు కారణం అంటున్నారు. దిల్లీ బాలల హక్కుల కమిషన్ చేసిన ఓ అధ్యయనంలో… 70 శాతం బాలనేరస్తులకు అసలు నేరం తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదని తేలింది. పేదరికంలో ఉన్న పిల్లలను క్రమంగా ఉచ్చులోకి లాగి వాళ్లతో మాదకద్రవ్యాల సరఫరా, దొంగతనాలు, హత్యలు చేయించడం కూడా సరికొత్త ట్రెండ్‌గా మారింది.
జర్మన్ తాత్వికుడు పీటర్ స్లార్జ్ తన పుస్తకం ‘రేజ్ అండ్ టైం’లో కోపాన్ని రెండురకాలుగా విభజిస్తాడు. మొదటిది ‘అణచి పెట్టుకున్న కోపం’. ఎన్నో రోజులుగా అసమానతను, అవమానాన్ని భరించి… అందుకు బదులు కోసం ఎదురుచూసే పరిస్థితి. అది వ్యక్తిగతం అయితే ఇంటివరకే పరిమితం అవుతుంది. కానీ సామాజికం అయితే ఉద్యమంగా మారుతుంది. ఈ ‘అణచి పెట్టుకున్న కోపాని’కి ఓ లక్ష్యాన్ని చూపించి, అందరినీ సంఘటితం చేయగలిగే సత్తా ఉన్నవాడు నాయకుడిగా మారతాడు. కానీ కోపానికి స్పష్టమైన కారణం, లక్ష్యం అంటూ లేకపోతే! దాన్ని ‘చెదిరిన కోపం’ అంటాడు పీటర్. అలక్షిత కోపం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఓ స్పష్టత ఉండదు. అసహనం ఉంటుంది కానీ, అది తీరే మార్గం తోచదు. అసలు దానికి కారణం ఏంటో కూడా అర్థం కాదు. సోషల్ మీడియాలో ద్వేషపు రాతలు, ఒక్కసారిగా అపరిచితులతో గొడవ పెంచుకోవడం, చిన్నపాటి వాదనకే భౌతిక దాడికి దిగడం… లాంటి చర్యలకు ఈ అలక్షిత కోపమే మూలం. ఇంతకూ ఇలా ఎందుకు జరుగుతున్నది అన్న ప్రశ్నకు సామాజిక నిపుణుల నుంచి స్పష్టమైన జవాబులు వినిపిస్తున్నాయి.
సామాజిక అసమానత : సంపద పెరుగుతున్నది, సౌకర్యాలు పెరుగుతున్నాయి అంటూ అంతా ఊదరగొట్టేస్తున్నారు. కానీ వాటితోపాటు వ్యత్యాసం పెరిగిపోతున్నదన్నదీ వాస్తవం. పెరుగుతున్న ఖర్చులకు సరిపడా వేతనజీవుల ఆదాయం పెరగడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ అసమానత తీవ్రమైన ఒత్తిడికి, ఉక్రోషానికీ గురిచేస్తున్నది.
అసహనం: ప్రపంచీకరణ పుణ్యమా అని లోకం భౌతికత దిశగా జారిపోయింది. ఓ అయిదువేలు పెట్టి ఫోన్ కొంటే అవసరం తీరుతుంది. కానీ అందులో లక్షన్నర పెట్టినా కూడా మరో కొత్త మోడల్ ఏదో ఊరిస్తున్నది. నువ్వు సమర్థుడివి, ‘మగాడివి’ అని నిరూపించుకోవాలంటే ఉన్నతమైన ఉత్పత్తులే వాడాలని ప్రకటనలు ఊదరగొట్టేస్తున్నాయి. వెరసి కష్టపడి దక్కించుకున్న వస్తువులు కూడా సంతృప్తిని ఇవ్వడం లేదు. కొనుగోళ్ల పరుగులో వెనుకడుగు వేసేందుకు పోలికలు అడ్డు వస్తున్నాయి.
ఒంటరితనం: స్నేహితులు లేనివారిలో కుంగుబాటు ఎక్కువ, పరాయి దేశంలో ఉండేవారిలో ఒంటరితనం జాస్తి, చిన్న కుటుంబాల్లో స్పర్ధలు పెరుగుతున్నాయనీ… ఇప్పటి జీవనశైలికి సంబంధించి రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బాల్యం నుంచే ఒంటరితనం మొదలైపోతున్నది. కెరీర్లో పరుగులు పెట్టి తీరాల్సిన పరిస్థితిలో తల్లిదండ్రులు, మనోవికాసం కంటే విద్యకే ప్రాధాన్యం ఇస్తున్న గురువులు, నేస్తాలతో ఆడే సమయాన్ని కల్పించని చదువులు, సహోద్యోగులను పోటీదారులుగా మార్చేసిన ఆఫీసులు… వెరసి ఎటుచూసినా ‘నేను-నాది’ అనే ఉనికే మిగులుతున్నది. బాధ అయినా, సంతోషమైనా మరొకరితో పంచుకునే పరిస్థితి మాయమైపోయింది. ఇక మిగిలేది అసంతృప్తే కదా!
అపనమ్మకం: పేదవాడికి న్యాయం దక్కడం లేదు, అపరాధులు తప్పించుకుంటున్నారు, అవినీతి పెరిగిపోతున్నది, డబ్బున్నవాడిదే రాజ్యం… మనల్ని కాపాడాల్సిన వ్యవస్థల మీద అపనమ్మకం పెరిగిపోతున్నది. ఇందుకు విరుగుడుగా ఏం చేయాలో తెలియని అయోమయం. ఎవరినీ నిందించి లాభం లేదనే బాధ. వెరసి తెలియని కోపానికి ఆజ్యం పోస్తున్నది.
రాజకీయాలు: ప్రపంచవ్యాప్తంగా కూడా విభజించి పాలించే రాజకీయాలదే పైచేయిగా మారింది. మంచి చెప్పాల్సిన మేధావులు సైతం ఈ విభజనలో దారి తప్పుతున్నారనే భయం ఉంది. కులం, మతం, స్తోమత, పార్టీ, ప్రాంతం, భాష… ఇలా సవాలక్ష పట్టింపుల ఆధారంగా మనుషులు విడిపోయి ఉన్నారు. తన వర్గానికి చెందనివాళ్ల మీద అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు.
అస్పష్టత: ‘ఒక నాయకుడి వల్ల దేశానికి హాని జరిగింది’ అన్న అభిప్రాయం ఎవరికన్నా ఉందే అనుకుందాం. దానికి కారణం ఏమిటి? అన్నదానికి స్పష్టమైన జవాబులు వినిపించడం లేదు. ఈ సోషల్ మీడియా కాలంలో… ఎవరో చెప్పినవో, ఎక్కడో చదివినవో భావాలను మనవిగా మార్చేసుకుంటున్నారు. అవగాహన, విశ్లేషణ, అవతలి వాదనలు వినే ఓపిక బొత్తిగా లోపించేశాయి. ఉన్నత విద్యావంతులు సైతం ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేయడమే ఇందుకు సాక్ష్యం.
ఇవే కాదు! కాలుష్యం లాంటి తీవ్రమైన సమస్యలను నిస్సహాయంగా చూస్తుండిపోవడం, శ్రమదోపిడీని అడ్డుకోలేకపోవడం, విపరీతమైన ద్రవ్యోల్బణం… లాంటి ఎన్నో విషయాలు మనుషుల్లో అసహనాన్ని నింపుతున్నాయి. అది కోపంగా మారుతున్నది.
లక్ష్యం లేని కోపం వల్ల అడుగడుగునా అనర్థమే! ప్రతి ఒక్కరితోను, ప్రతి సందర్భంలోను అసహనంగా ఉండటం. చిన్నపాటి గొడవకే భౌతిక దాడులకు సిద్ధపడటం, తనలో కోపానికి ఓ మార్గం చూపించేందుకు హింసాత్మక గుంపుల్లో చేరడం, వర్గ రాజకీయాల్లో ఏదో ఒకవైపు చేరి ద్వేషంలో పాలుపంచుకోవడం, సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కడం… ఇవన్నీ కూడా ‘సామాజిక కోపానికి’ ఫలితాలే. దాన్ని అణచుకున్నా కూడా సమస్యలు తప్పవు.
ఎటుచూసినా పెరుగుతున్న కోపాన్ని దాటేందుకు వ్యక్తిగతంగా ఎలాగూ ప్రయత్నిస్తాం. అదే సమయంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెంచే అధికారులు; సామాజిక సమస్యల గురించి అవగాహన కల్పించి ఆ దిశగా ఓ లక్ష్యాన్ని కల్పించే సామాజిక కార్యకర్తలు; మార్కులే కాకుండా విలువలు కూడా నేర్పడానికి ప్రాధాన్యం ఇచ్చే ఉపాధ్యాయులు; స్వార్థంతో రాజకీయాలు నెరపకుండా సమాజహితం కోరే నాయకులు; పిల్లలతో తగినంత సమయం గడుపుతూ వారిని గమనించుకునే తల్లిదండ్రులు; అన్ని వాదనలనీ సమన్వయం చేసుకునే మేధావులు…. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాల్సిందే. లేకపోతే ప్రతి ఇంట్లోనూ అణచుకుని ఉన్న కోపం దేశం తీరునే మార్చేస్తుంది. గమ్యం లేకుండా చేస్తుంది.
సినిమాలు చూసి, పుస్తకాలు చదివి, వార్తలు విని… దొంగతనమో, దోపీడీనో చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓటీటీలో వచ్చే క్రైం థ్రిల్లర్‌ని చూసో, ఓ సంచలన నేరాన్ని అనుకరించో హత్యలు చేయడం సర్వసాధారణంగా మారుతున్నది. తెలుగు రాష్ర్టాలను వణికించిన ప్రెషర్ కుక్కర్ హత్యను ‘సూక్ష్మదర్శిని’ అనే సినిమా చూసి చేసినట్టు హంతకుడు చెప్పడం గమనార్హం. కొన్ని నెలలపాటు ముంబయి నగరాన్ని వణికించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో ముద్దాయి ‘డెక్స్టర్’ అనే సిరీస్ చూసి ఈ హత్య చేసినట్టు భావించారు. దారుణంగా హత్యచేసి ఫ్రిజ్, సూట్‌కేస్, సిమెంట్ డ్రమ్ లాంటి వాటిల్లో తరలించేస్తున్నారు. ఇలాంటి హత్యలను కాపీక్యాట్ హత్యలు అంటారు.
‘మనిషి ఎప్పుడూ ఇతరులను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటాడు. రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారంటే… వాళ్లకు పక్షులే ప్రేరణ. దురదృష్టవశాత్తు ఈ తీరు నేరాలకు కూడా పాకుతున్నది. నేరాలకు మీడియాలో విస్తృత ప్రచారం దక్కడం వల్ల… ఏదన్నా నేరం చేయాలని ఎదురుచూసేవారికి అవి కొత్తకొత్త మార్గాలను సూచిస్తున్నాయి’ అంటారు అంబేద్కర్ లా యూనివర్సిటీకి చెందిన సుకీర్తి.
కోపం గురించి అంతులేని వివరాలు, విశ్లేషణలు వినిపిస్తాయి. కానీ చాలామంది నిపుణులు ఒప్పుకొనేది మనకు స్పష్టంగా కనిపించే దశలు మాత్రం మూడు. అవేంటో… వాటికి పరిష్కారం ఏంటో గమనిస్తే,అది అదుపు తప్పకుండా చూసుకోవచ్చు.
బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాం లేదా ఏదో పని చేసుకునేటప్పుడు పక్కనే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సహజమే అయినా మనలో సహనం పాళ్లు తక్కువ కావడం వల్ల చిరాకు కలుగుతుంది. శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమస్య నుంచి దృష్టి మరల్చడం, సమస్య గురించి వాళ్లకు చెప్పడం లాంటి చిన్నపాటి చేతలతో తప్పకుండా పరిష్కారం ఉంటుంది.
సమయానికి వస్తువు చెడిపోవడం, పనిలో సహకారం లభించకపోవడం లాంటి సందర్భాలను విసుగు కలిగించే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మూలాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకోవడం, చిన్న బ్రేక్ తీసుకోవడం, ఇలాంటివన్నీ సహజమే అని సర్దుకుపోయే ప్రయత్నం చేయడం విసుగు సద్దుమణిగేలా చేస్తాయి.
ఆఫీసులో రాజకీయాలు, ఇంట్లో గొడవలు, రోడ్డు మీద వాగ్వాదం… వ్యతిరేకతను ప్రతిబింబించే సందర్భాలు. ఇద్దరి మధ్య మొదలయ్యే అభిప్రాయ భేదం వైరంగా మారితే దాని పరిణామాలకు ఇక అంతే ఉండదు. వారిపట్ల మన ప్రవర్తన, దృష్టికోణం పూర్తిగా మారిపోతాయి. వాగ్వాదంలోకి దిగకుండా నియంత్రించుకోవడం, పరుషంగా కాకుండా స్పష్టంగా మన అభిప్రాయాలను చెప్పడం లాంటి చర్యలు ఈ పరిస్థితి మరింత దిగజారకుండా చేస్తాయి.
వలచిన మనిషి దక్కకపోతే వగచడం ఒకప్పటి తీరు. నచ్చిన మనిషి దక్కలేదనో, లేకపోతే పెళ్లయ్యాక మరో వ్యక్తి నచ్చడం వల్లో, నచ్చి పెళ్లి చేసుకున్న మనిషే చిరాగ్గా తోచడంతోనో… అడ్డుగా ఉన్నవారిని తొలగించుకోవడం ఇప్పటి పరిస్థితిగా కనిపిస్తున్నది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఏటా దాదాపు 50వేల మంది మహిళల హత్య జరుగుతుంటే…
అందులో దాదాపు 60 శాతం సందర్భాల్లో భర్తలు లేదా ఇతర కుటుంబసభ్యులదే పాపం అని తేలింది.
1 . మనదేశంలో జరుగుతున్న హత్యలలో వివాహేతర సంబంధాలే మూడో అతి పెద్ద కారణంగా నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) వెల్లడించింది. ఒకప్పుడు ఇలాంటి సంఘటనల్లో మహిళలే బాధితులుగా ఉండేవారు. కానీ క్రమంగా ఈ యుద్ధంలో మరణిస్తున్న మగవారి సంఖ్యా పెరుగుతున్నది.
2. వివాహేతర హత్యలలో 58 శాతం మహిళలు బాధితులైతే, 42 శాతం మగవారని ఒకానొక అంచనా. సర్దిచెప్పే పెద్దలు లేని చిన్న కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు ఎక్కువగా ఉంటున్నాయని ఐఐపీఎస్ అనే సంస్థ విశ్లేషిస్తున్నది.
3. మరో ఆసక్తికరమైన గమనింపు ఏమిటంటే… సోషల్ మీడియా వాడకంతో పాటుగా వివాహేతర/ ప్రేమ హత్యల సంఖ్య పెరగడం. గత 15 ఏళ్లుగా రెండిటినీ పోల్చిన తర్వాత తేల్చిన విషయమిది.
– కె.సహస్ర