ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. ‘టర్మ్ ఇన్సూరెన్స్’. ఒకవేళ కుటుంబ పెద్ద మరణిస్తే.. తనపై ఆధారపడిన కుటుంబానికి దీనిద్వారా పెద్దమొత్తంలో డబ్బులు అందుతాయి. అందుకే, ఇన్నాళ్లూ మగవాళ్లే ఎక్కువగా ఈ పాలసీలను తీసుకుంటూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు ‘టర్మ్ ఇన్సూరెన్స్’ ఆడవాళ్లవైపు టర్న్ తీసుకుంది. తాజాగా ‘పాలసీబజార్’ నిర్వహించిన సర్వేలో.. ‘టర్మ్ ఇన్సూరెన్స్’ తీసుకుంటున్న మహిళల సంఖ్య గత రెండేళ్లలో 80 శాతం పెరిగినట్టు వెల్లడైంది.
అంతేకాదు.. పెద్దమొత్తంలో బీమా పరిహారం అందేలా పాలసీలను ఎంచుకుంటున్న మహిళలు 120 శాతం పెరిగారు కూడా. వీరిలో ఉద్యోగాలు – వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించే మహిళలు 55 నుంచి 60 శాతం ఉన్నట్లు తెలిసింది. గృహిణులు 40 శాతం ఉన్నారట. వర్కింగ్ ఉమెన్ తీసుకుంటున్న పాలసీలు కూడా రూ.రెండు కోట్లు, ఆపై కవర్ చేసేవే ఎక్కువ. ఇందులోనూ 30 ఏళ్లకు అటూ ఇటుగా ఉన్నవారే పాలసీలు తీసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు.