శనివారం 06 జూన్ 2020
Komarambheem - May 24, 2020 , 00:10:17

ఖర్చీఫ్‌ కా కహానీ !

ఖర్చీఫ్‌ కా కహానీ !

ముక్కు కారినప్పడు.. ముఖానికి చెమట పట్టినప్పడు మీరు నిత్యం తుడుచుకోడానికి ఉపయోగిస్తున్న దస్తీ (హ్యాండ్‌ ఖర్చీఫ్‌)కి ఓ పురాతన చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా..? 15వ శతాబ్దం నుంచే ఇవి అమల్లో ఉన్నాయన్న విషయం ఎప్పుడైనా విన్నారా..? నిత్యం మన ప్యాకెట్‌ జేబుల్లో.. ఉండే దస్తీ కరోనా నేపథ్యంలో చర్చకు వస్తోంది. మాస్కులు అందుబాటులో లేనివారు తమ ఖర్చీఫ్‌ను ముఖానికి కట్టుకుంటూ వైరస్‌ నుంచి రక్షణ పొందుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఖర్చీఫ్‌ చరిత్రను తెలుసుకోవాలంటే చదువండి మరి.    

 - కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

15వ శతాబ్దం నుంచే ఖర్చీఫ్‌లున్నాయట! 

అంగ్లంలో ఖర్చీఫ్‌ అనిపిలుస్తాం. దీనినే తెలుగులో కొన్ని ప్రాంతాల్లో చేతిరుమాలని, మరికొన్ని ప్రాంతాల్లో దస్తీ అని అంటాం. నిత్యం మన జేబులో ఉంటూ.. మనకు తెలియకుండా ఎన్నెన్నో పనులకు వినియోగిస్తున్న దస్తీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది.  15వ శతాబ్దంలో.. సోర్జా అనే ఇటాలియన్‌ రాజు వద్ద నాలుగు వందల దస్తీలు ఉండేవని.. వివిధ పరిశోధనలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో బ్రిటన్‌లో కాగితాలనే దస్తీలుగా ఉపయోగించేవారని సమాచారం. 18వ శతాబ్దం నుంచి చేతి రుమాళ్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 18, 19 శతాబ్దాల్లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల్లో రాజకుటుంబీకులు దస్తీలపై వెండి, బంగారం వంటి దారాలతో ఎంబ్రాయిడరీ మాదిరిగా చేయించి.. వారి హుందాకు ప్రతీకగా చూపేవారట! అంతే కాదు.. ముందుగా దస్తీని అంగ్లంలో కెర్చీఫ్‌ అనేవారట! దీనికి ఇంగ్లండ్‌కు చెందిన ‘కెర్చీ రూండ్‌ కింగ్‌ రిచర్డ్‌ ఇల్‌' అనే రాజు.. కెర్చీఫ్‌కు ముందు హ్యాండ్‌ అనే పదం చేర్చారు. దీంతో కెర్చీఫ్‌ రాను రాను హ్యాండ్‌ ఖర్చీఫ్‌గా మారింది. 

ఎన్నెన్నో ప్రయోజనాలు

ఖర్చీఫ్‌ను ఆరంభంలో కేవలం ముక్కు, ముఖం తుడుచుకోవడానికి మాత్రమే వినియోగించే వారని పరిశోధనలను బట్టి తెలుస్తోంది. కానీ, రాను రాను వీటి ఉపయోగం మారుతూ వచ్చింది. ఎండదెబ్బ తగులకుండా.. తలకు కట్టుకోవడం, దుమ్ము, ధూళి వంటికి శరీరంలోకి వెళ్లకుండా ముక్కుకు కట్టుకోవడం, వివిధ కార్యక్రమాల్లో భోజనం చేసి చేతులు కుడుక్కున్నాక.. తుడుచుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో అందులోనే వివిధ రకాల సామగ్రి తీసుకెళ్లడం.. వేడి వస్తువులను చేతుల్లోకి తీసుకునేటప్పుడు.. చేతి కాలకుండా వినియోగించడం.. అనుకోకుండా దెబ్బలు తగిలితే.. వాటికి ప్రాథమిక చికిత్స కింద కట్టు కట్టేందుకు వినియోగించడం, ర్యాలీలు, డ్యాన్స్‌ల్లో వివిధ రకాల రక్షణ కోసం.. తలకు కట్టుకోవడం.. ఎండకాలంలో వేడి తగలకుండా నీటిలో తడిపి కట్టుకోవడం.. ఇప్పుడు కరోనా వైరస్‌ ధరిచేరకుండా ఉండేందుకు ముఖానికి కట్టుకోవడం వరకు.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలియకుండానే దస్తీని ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నాం.

రంగురంగుల్లో...

ఆరంభంలో చుతురస్రాకారంలో తెల్లని దస్తీలు మాత్రమే ఉండేవి. రానురాను.. వివిధ డిజైన్లలోకి మారుతూ వచ్చాయి. మార్కెట్‌లో పెరుగుతున్న కొత్త పోకడలను ఆసరాగా చేసుకొని.. దస్తీలు తయారు చేసే కంపెనీలు వినియోగదారులను అకట్టుకునే విధంగా వీటిని రూపుదిద్దుతూ వచ్చాయి. అంతేకాదు.. ఒకప్పుడు.. ఆడ మగ అన్న తేడా లేకుండా ఒకే సైజు ఖర్చీఫ్‌లు ఉండగా.. ప్రస్తుతం పద్ధతి మారింది. మహిళల కోసం ఎన్నో వినూత్న ఖర్చీఫ్‌లు ఆవిష్కృతమవుతున్నాయి. రంగు రంగుల డిజైన్లే కాదు.. వివిధ రకాల ఎంబ్రాయిడరీతో చిన్న సైజులో చూడముచ్చటగా తయారు చేస్తున్నారు. logo