శుక్రవారం 07 ఆగస్టు 2020
Komarambheem - Apr 24, 2020 , 01:27:45

నిరుపేదలకు సర్కారు అండ

నిరుపేదలకు సర్కారు అండ

  • దాతల సహకారంతో సరుకులు పంపిణీ
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల
  • నగరంలో 700 మంది నాయీ బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేత 

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్‌ భవన్‌లో 700 మంది నాయీ బ్రాహ్మణులకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైరస్‌ కట్టడికి స్వీయ నిర్బంధమే మార్గమని, అందుకే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో పేదలు, వలస కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున బియ్యం, నగదు అందిస్తున్నామని చెప్పారు. దాతల సహకారంతో నగరంలో వివిధ కులవృత్తులు చేసుకొని జీవిస్తున్న 2,500 మంది పేద కుటుంబాలకు తొమ్మిది రకాలతో కూడిన సరుకులను అందిస్తున్నామని చెప్పారు. పేదలను ఆదుకోవడానికి దాతలు మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించి, వైరస్‌ను తరిమికొట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు చల్ల హరిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


logo